ఉమ్మడి నల్గొండ జిల్లా గట్టు సింగారం గ్రామానికి చెందిన ఇటికాల శ్రీను తన ఇంటి పేరును కాకుండా తన గ్రామ పేరుతో ప్రజలకు సుపరిచితమైన సింగారం శీను అనారోగ్యంతో 4 డిసెంబర్ 2022 ఆదివారం మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులను, సాంస్కృతిక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగారం శీను మరణం ప్రతి ఒక్కరిని కలిసి వేసింది.పేదరికంలో పుట్టిన సింగారం శీను పేదరికంలోనే మృతి చెందాడు.దశాబ్దాల కాలం పాటు సాంస్కృతిక రంగంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ’’ నెత్తురు పారంది ఎన్నడో నా తెలంగాణ నేలలో… నేలకు రాలంది ఎన్నడో నా తెలంగాణ నేలలో’’.. అంటూ పల్లె పల్లెనా పాట పాడినశ్రీను మన మధ్య లేకపోవడం విషాదకరం..తన గ్రామాన్ని వదిలి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో గ్రామ గ్రామాన అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో భాగమై తమ ఆట పాటలతో, గజ్జల సవ్వడితో గానమై పల్లెలన్నీ తిరిగి ప్రజల మన్ననలు పొందిన సాంస్కృతిక సేనాని ఇటికాల శ్రీను.
గ్రామాలలో నాడు కరెంటు కోతతో అలమటిస్తున్న రైతాంగానికి అండగా ‘‘కరెంటు కోతతోటి ని కాలిన మోటరోడ’’ అంటూ తన గళం తో గర్జించి రైతాంగ పోరాటంలో తమ వంతు భాగస్వామ్యాన్ని కొనసాగించాడు ..
విప్లవ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను ఎత్తి పడుతూ ‘’దొంగ ఎదురు కాలుపులలో కనుమూసిన కూనలారా- ఎర్ర పువ్వులా దండలేదుమో మా అన్నలారా’’ అంటూ అడవిలో అమరులైన అన్నల కుటుంబాలకు సైతం అండగా నిలిచాడు సింగారం శ్రీను. రాజ్యం విధించిన నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా జైలు గోడలను సైతం ముద్దాడి జైల్లోని ఉద్యమ కారులకు అండగా నిలిచాడు. ‘‘జంగ్ సైరన్ నూదిరో జంగ్ లో మా అన్నలు ..
జైలులో బంధించిరో జంగులో మా అన్నలు’’ అంటూ మేము చదువుకునే రోజుల్లో గ్రామాలలో పాటలను పాడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ పోరాటంలో తాను ముందుండేవాడు నిజానికి ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో కళాకారులుగా పనిచేసిన వాళ్లు నేడు ప్రభుత్వం కల్పించిన సాంస్కృతిక సారధిలో పనిచేస్తూ ఉన్నవాళ్లను చూసాం. శ్రీను మాత్రం తాను నమ్మిన సిద్ధాంతం కోసం పరితపించే మనిషిగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కల్పించే సాంస్కృతిక సారధిలో పనిచేయకపోవడం ఆయన అంకిత భావానికి నిదర్శనం.. ఆయనకు ఆ అవకాశం వచ్చిందా లేదా అనే చర్చ పక్కకు పెట్టినట్లయితే ఆయన నిజాయితీకి నిలువుటద్దంగా చెప్పుకోక తప్పదు.కాస్తో కూసో పైరవీ పెడితే సాంస్కృతిక సారధిలో ఉద్యోగం వచ్చి ఉండొచ్చేమో బహుశా. కానీ ఆస్తులు, పాస్తులు, అంగు ఆర్భాటాల జీవితాన్ని కోరుకోకుండా సాధారాణమైన జీవితాన్ని కొనసాగించాడు.
గత ఆరు ఏడు సంవత్సరాల క్రితం గుండె సమస్యతో చావు బతుకుల మధ్య ఆపరేషన్ కావడంతో శ్రీను ఇన్నాళ్లు బ్రతికాడు. అనారోగ్యం సమస్యతోనే జీవితాన్ని కొనసాగిస్తూ తనకు కావాల్సిన మెడిసిన్ కు పొట్టకూటి కోసం ఓ ప్రైవేటు సెక్టార్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడిపాడు.
కలుపుగోలు తనముతో కలియ తిరిగిన శీను ఏ పల్లెకు వెళ్లిన పరిచయం అంటూ లేని మనిషి లేకపోలేదు.
సామాన్య కార్యకర్తగా జీవితాన్ని కొనసాగించి, పేదరికంలో పుట్టి, పేదరికంలో పెరిగి నిజాయితీగా, నిస్వార్థంగా జీవించాడు. ఆయన త్యాగాన్ని ఎలా ఎత్తిపట్టాలో ఏమో కాని ఆయన లాగా నిస్వార్థంగా జీవించడం కొంతమందికే సాధ్యపడుతుంది.అంతటి వాళ్ళం అవుతామో కాదో కానీ ఆయన చేసిన కృషికి మాత్రం ఆయనకు వినమ్రంగా తలవంచి జోహార్లు చెప్పక తప్పదు.
– వి.గోపీనాథ్ (ఎం.ఫీల్- జర్నలిజం)




