గురుకులాల్లో  కలుషిత ఆహారం..

ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ  మాజీ మంత్రి హరీష్‌ విమర్శలు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ…మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయి5న ప్రశాంత్‌ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్‌ పాయిజన్‌ ఉదంతం వెలుగులోకి రావడం దారుణమన్నారు.

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చేరారని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్‌ నిర్లక్ష్య వైఖరికి ఈ ఉదంతాలు అద్దం పడుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామని హరీష్‌ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *