డిసెంబర్ 22, జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం
కొంత మంది వ్యక్తులు ఈ భువిపై జన్మించి,తమ కోసం కాకుండా దేశం కోసం, ప్రపంచం కోసం నిస్వార్ధం గా సేవ చేసి,జీవిత సర్వస్వం ధారబోసి, వివిధ రంగాల్లో తమ అమూల్యమైన సేవల నందించి, తమదైన ముద్రవేసి, తరతరాలకు తరగని జ్ఞానాన్ని జాతికి వారసత్వ సంపదగా అంకితం చేసి, ఆచంద్రతారార్కమైన కీర్తిని సంపాదించుకుని, చరిత్ర సృష్టిస్తారు. ఆ కోవకు చెందిన వాడే మన భారతీయ మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. తమిళనాట పుట్టి, భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ ఖ్యాతి నార్జించి, ఈనాటికీ మహామహులైన గణిత పండితుల మస్తిష్కాలకందని గణిత శాస్త్ర ప్రశ్నలు సంధించి అమరుడైన సహజ గణిత మేథావి రామానుజన్ గురించి తెలుసుకోవడం మన కనీస ధర్మం. రామానుజన్ గణిత ప్రజ్ఞాపాటవాలకు అసూయ చెంది,ఈర్ష్యా ద్వేషాలతో నిద్రలేని రాత్రులు గడిపిన గణిత పండితులెంతో మంది నాటి కాలంలో కోకొల్లలు. ఎంతో మంది గణిత మేథావులకు కొరకరాని కొయ్యగా మారి, తన సిద్ధాంతాలతో, సంక్షిప్త వివరణలతో, గణితశాస్త్ర దిగ్గజాల ఊహకందని గణాంకాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గణిత ప్రజ్ఞ నభూతో నభవిష్యతి. శ్రీనివాస రామానుజన్ కడు పేదకుటుంబంలో జన్మించాడు.రామానుజన్ తండ్రి ఒక గుమస్తా.తల్లి ఒక సాధారణ గృహిణి. పూట గడవడానికే కష్టమైన ఆర్ధిక ఇబ్బందుల మధ్య రామానుజన్ విద్యాభ్యాసం కొనసాగింది.
ఎక్కడా రామానుజన్ స్థిరంగా చదువుకోలేదు. పాఠశాలకు సరిగా హాజరయ్యేవాడు కాదు. కేవలం గణితశాస్త్రం మీదే తన దృష్టినంతా కేంద్రీకరించి, ఇతర పాఠ్యాంశాల పట్ల నిర్లక్ష్యం వహించడం వలన రామానుజన్ చదువుల్లో ఇతర విద్యార్ధుల కంటే ఎంతో వెనకబడి ఉండేవాడు.పగలు రాత్రి తేడా లేకుండా, గణితశాస్త్ర సాధన చేసేవాడు. నోటు పుస్తకాలు కొనే స్థోమత లేక, చిత్తు కాగితాలపైనే తన గణిత గణాంకాల సాధన సాగేది. చిన్న వయసు లోనే ఆరు వేలకు పైగా గణిత సిద్ధాంతాలను అవపోసన పట్టి అనేక గణిత పరిశోధనలు చేసాడు. కేవలం 20 రూ.ల వేతనంతో ఒక గుమస్తాగా పనిచేసి తర్వాత మద్రాసు యూనివర్శిటీ వారి 75 రూ.ల ఉపకార వేతనంతో జీవితాన్ని నెట్టు కొచ్చిన రామానుజన్ పేదరికాన్ని చూసి చలించి పోయిన వారెంతో మంది ఉన్నారు. రామానుజన్ ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే వాడు. మశూచి వ్యాధికి ఊళ్ళకు ఊళ్ళు తుడిచి పెట్టుకు పోతున్న దశలో రామానుజన్ దీని నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఎన్నో ఆర్ధిక ఇబ్బందులతో ఏటికి ఎదురీదుతూ,ఎన్నో అవహేళనలు సహిస్తూ, చివరకు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ‘‘గాడ్‌ఫ్రే హెరాల్డ్ హార్డీ ‘‘సహకారంతో కేంబ్రిడ్జి లోకి అడుగుపెట్టాడు. ఇతరుల ప్రతిభను చూడలేక, గుర్తించలేక, అసూయతో దగ్ధమయ్యే కుహనా మేథావులున్న కాలంలో విదేశీయుడైనప్పటికీ, ఫ్రొ హార్డీ రామానుజన్ యొక్క ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో విశేష కృషి చేసాడు. రామానుజన్ కు వెన్ను దన్నుగా నిలిచి గణిత శాస్త్రానికి ఎనలేని సేవ చేసాడు.ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (ఎఫ్.ఆర్.ఎస్) గా ఎంపికైన వారిలో రామానుజన్ పిన్న వయస్కుడు, కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్ ఫెలో గా ఎంపికైన మొదటి భారతీయుడు రామానుజన్. రామానుజన్ స్ఫృశించని గణిత అంశమంటూ ఏదీ లేదు. అహరహం గణితం కోసం తపించాడు.
గణితమే జీవితంగా భావించాడు. గణితమే శ్వాసగా జీవించి, విదేశీ వాతావరణాన్ని,విదేశీ ఆహారాన్ని, అలవరచు కోలేక పోయిన రామానుజన్ తీవ్ర అస్వస్థతకు గురై, స్వదేశానికి తిరిగి వచ్చాడు.స్విస్ గణిత శాస్త్రవేత్త లియోనార్డ్ ఆయిలర్, జర్మన్ కు చెందిన కార్ల్ గుత్సవ్ జాకోబీ, కార్ల్ ఫ్రెడరిక్ గాస్ లతో సమానమైన ప్రతిభ కనబరిచిన రామానుజన్ భారతీయులకు గర్వకారణం.1729 సంఖ్యను ‘‘రామానుజన్- హార్డీ’’సంఖ్యగా పిలుస్తారు.1729ను రెండు ఘనాల మొత్తంగా రెండు రకాలుగా వ్రాయగల అతి చిన్న సహజ సంఖ్య గా రామానుజన్ విశదీకరిస్తూ హార్డీ వంటి గణిత శాస్త్ర ఉద్ధండుని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాడు.రామానుజన్ మేథాశక్తివర్ణింప శక్యం కాదు. అనేక గణిత విభాగాల్లో తనదైన శైలిలో అద్భుతమైన పరిష్కారాలు చూపి, గణిత ప్రపంచంలో రారాజు గా ప్రకాశించి, చిన్న వయస్సులోనే అనేక గణిత ప్రశ్నలకు దారి చూపించి, మరెన్నో గణిత ప్రశ్నలను గణిత ప్రపంచానికి సంధించి, ఈ లోకాన్ని విడిచి పెట్టిన రామానుజన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా గణిత శాస్త్ర రూపంలో అనునిత్యం మనతోనే సహవాసం చేస్తున్నాడు. శ్రీనివాస రామానుజన్ గణిత ప్రజ్ఞాపాటవాలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం డిసెంబర్ 22 వ తేదీని సాంకేతిక దినోత్సవం గా పాటిస్తున్నది. రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవలను గౌరవిస్తూ 2012 వ సంవత్సరం నుండి భారత ప్రభుత్వం ప్రతీ ఏటా రామానుజన్ జన్మదినమైన డిసెంబర్ 22 వ తేదిని జాతీయ గణిత దినోత్సవం గా పాటిస్తున్నది.నేటితరం విద్యార్థులు రామానుజన్ గణిత శాస్త్ర ప్రతిభా పాటవాలను స్ఫూర్తిగా తీసుకుని, భారత దేశాన్ని గణిత రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దాలి. గణిత శాస్త్ర ప్రపంచంపై వెలుగు రేఖలు పూయించిన గణిత సూరీడు అస్తమించినా, ఆ గణిత మేథావి రూపొందించిన గణిత సూత్రాలు, గణిత ఆవిష్కరణలు అనునిత్యం మన మధ్య సజీవంగానే ఉంటాయి.
సుంకవల్లి సత్తిరాజు,
9704903463.




