ఖమ్మంలో 100 సీట్లతో మెడికల్‌ ‌కాలేజ్‌

  • 8.5 ‌కోట్లతో భవనాలు నిర్మాణం…గురువారం నుంచే తరగతులు
  • రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి
  • ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు

పాలమూరు ప్రజల కరువును శాశ్వతంగా తీర్చే ప్రాజెక్టు ‘ఎత్తిపోతల’ : విలేఖరుల సమావేశంలో మంత్రి
ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ఈ ‌యాడాది నుంచే  100 సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభిస్తామని, 8.5 కోట్లతో భవనాలు నిర్మాణం చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. గురువారం నగరంలోని పాత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను హరీష్‌ ‌రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. 100 సీట్లతో ఈ సంవత్సరం నుండే కళాశాల ప్రారంభం కానున్నట్లు, నేటి నుండి తరగతులు ప్రారంభం కానున్నట్లు వారు తెలిపారు. రూ. 8.5 కోట్లతో పాత కలెక్టరేట్‌, ‌పౌరసరఫరాలు, గిరిజనాభివృద్ది అధికారి, రోడ్లు భవనాల శాఖల కార్యాలయాలను వైద్య కళాశాల, హాస్టళ్లకు అనుగుణంగా రెనోవేషన్‌ ‌చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వైద్య కళాశాలలో సమకూర్చిన ల్యాబ్‌లు, విద్యార్థులకు హాస్టల్‌, ‌మౌలిక సదుపాయాల కల్పనను మంత్రులు పరిశీలించారు. జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రాంత పిల్లలకు వైద్య సీట్లు ఎక్కువగా పొంది, మన ప్రాంతం నుండి వైద్యులు ఎక్కువగా తయారవ్వాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో తీసుకున్న నిర్ణయమని వారు తెలిపారు. వైద్య కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. బిడ్డ కడుపులో పడగానే, న్యూట్రిషన్‌ ‌కిట్‌, ‌ప్రసవం కాగానే కేసీఆర్‌ ‌కిట్‌ను ప్రభుత్వం అందిస్తున్నదని మంత్రి అన్నారు. ఈ పథకాలతో గతంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో 30 శాతం జరిగే ప్రసవాలు, నేడు 76.8 శాతానికి చేరుకున్నాయన్నారు.

జిల్లా ప్రధాన హాస్పిటల్‌లో ఎంఆర్‌ఐ ‌స్కానింగ్‌ ‌యంత్రం సమకూర్చాలని రవాణా శాఖ మంత్రి కోరగా, త్వరలో అందజేయనున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి అన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని రకాల సేవాలు అందజేస్తున్నట్లు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, లోకసభ సభ్యులు నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్‌ ‌విపి గౌతమ్‌, ‌పోలీస్‌ ‌కమీషనర్‌ ‌విష్ణు ఎస్‌ ‌వారియర్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, వనమా నాగేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, జెడ్పి చైర్మన్‌ ‌లింగాల కమలరాజ్‌, ‌రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ ‌కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్‌ ‌కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌రాయల శేషగిరిరావు, నగర మేయర్‌ ‌పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ ‌బచ్చు విజయ్‌ ‌కుమార్‌, ‌వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ‌డా. ఎస్‌ ‌రాజేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి మాలతి,  ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పాలమూరు ప్రజల కరువును శాశ్వతంగా తీర్చే ప్రాజెక్టు ‘ఎత్తిపోతల’ : విలేఖరుల సమావేశంలో మంత్రి
ఖమ్మం అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. గురువారం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌  ‌నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…నేటి నుండి ఆర్టీసి కార్మికులు ఆర్టీసి ఉద్యోగులని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌  ‌నేతృత్వంలో ఆర్టీసి ఉద్యోగుల బిల్లు ఆమోదం తెలిపిన సందర్భంగా కార్మికులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు రెండు నుండి మూడు వేల కోట్ల రూపాయలు సీఎం కెసిఆర్‌ ‌ప్రకటించారని అన్నారు. గవర్నర్‌ ఆర్టీసీ బిల్లును ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించారని, కానీ ఆ బిల్లును ఆపలేక పోయారని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ ‌మీద బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు విమర్శలు చేస్తున్నాయని, అసలు పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించింది సీఎం కెసిఆర్‌ అని అన్నారు.

ప్రతి పక్ష పార్టీలు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయని, కానీ పాలమూరు ప్రజలంతా సంతోషంతో ఉన్నారని అన్నారు. పాలమూరు ప్రజల శాశ్వత కరువును తీసే ప్రాజెక్ట్ ‌పాలమూరు ఎత్తిపోతల పథకం అన్నారు. ప్రతి పక్ష పార్టీలు ప్రజలకు మంచి చేసే ప్రతి పనిని ఏదో విధంగా అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రజలు మనోళ్లు కావాలా పగోల్లు కావాలా అని ఆలోచిస్తున్నారని, పనివంతులైన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో నోబుల్స్‌కు గోబెల్స్‌కు మధ్య పోటీ జరుగుతుందని, ప్రజలు ఎప్పుడైనా నోబుల్స్‌ను కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పుడైనా అబద్ధాలను నమ్ముకుందని విమర్శించారు హరీష్‌ ‌రావు. భారత దేశంలో లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్‌ ‌సీట్లతో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, కొత్తగూడెం జిల్లాలో కొయ్యగూడెం, గోండుగూడెంలలో విద్యార్థులకు ఎంబీబీఎస్‌ ‌సీట్లు వొచ్చాయని పేర్కొన్నారు.

నిరుపేదలను డాక్టర్లను చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందని, ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం కరువు పీడిత ప్రాంతంగా ఉండేదని, సీఎం కెసిఆర్‌ ‌చొరవతో పంజాబ్‌, ‌హర్యానను తలతన్నెలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్‌ ఒన్‌ అని, కాంగ్రెస్‌ ‌పార్టీ 50 యేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేకపోయారని, ఇప్పుడు కూడా వారు అధికారంలో ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌, ‌రాజస్థాన్‌ ‌రాష్ట్రాల్లో చేయలేక పోతున్నారని, తెలంగాణలో ఎట్లా చేస్తారని ఆయన ప్రశ్నించారు. తన్నుల సంస్కృతి వారిదని, టన్నుల సంస్కృతి తమదని, ఏమి రాకముందే ఖమ్మంలో కుర్చీలతో కొట్లాడుకున్నారని కాంగెస్‌ ‌నాయకులను మంత్రి హరీష్‌ ‌రావు ఎద్దేవా చేశారు. మత ఘర్షణలను సృష్టించి అయినా అధికారంలోకి రావాలని చూస్తున్నారని, వొచ్చే వర్షాకాలం నాటికి కృష్ణ నదిలో నీళ్ళు ఉన్నా లేకున్నా సీతారామ ప్రాజెక్ట్‌లో నిండుగా నీళ్ళు ఉంటాయని అన్నారు. మలిదశ ఉద్యమంలో కెసిఆర్‌ను ఖమ్మం జైల్‌లో పెడితే ఖమ్మం ప్రజలు గుండెకు హద్దుకున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *