రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
రైతు స్వరాజ్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో టిజెఎస్ అధ్యక్షులు ప్రొ. కోదండరామ్
వ్యవసాయ రంగ ధ్వంసానికి కెసిఆర్ కంకణం కట్టుకున్నాడు
కౌలు రైతు చట్టం అమలు చేయక అన్యాయానికి గురవుతున్నారు
ఆందోళన వ్యక్తం చేసిన వక్తలు
ముషీరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : వ్యవసాయంలో నష్టాలను తట్టుకోలేక రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎ కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోకపోతే వ్యవసాయం ఎలా బాగుపడుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణాలో కౌలు రైతుల స్థితిగతులపై అధ్యయన నివేదికను రైతు స్వరాజ్య వేదిక నాయకులు ఆశాలత అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ..ఎక్కువ వడ్డీ కట్టలేక, వడ్లు మార్కెట్లో అమ్ముకోలేక, పంట నష్టాలు తదితర కారణాలతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కవులు రైతు వడ్లు అమ్ముకోవడం చాలా కష్టంగా మారిందన్నారు. కౌలు రైతుకు గుర్తింపు కార్డు, రుణాలు, పంట నష్టానికి పరిహారం ప్రభుత్వం కల్పించాలన్నారు. కౌలు రైతుల సమస్యలపై గవర్నర్, అగ్రికల్చర్ సెక్రెటరీలకు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల గురించి పట్టించుకోవల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కౌలు రైతుల సమ్యలపై దృష్టిని కేంద్రీకరించి క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కౌలు రైతుల హక్కులను మరింతగా పటిష్టం చేసే కొత్త చట్టాన్ని మారుతున్న కౌలు స్వభావానికి అనుగుణంగా రూపొందించాలని భూగరిష్ట పరిమితికి మించి ఉన్న భూ జయమానుల వద్ద నుంచి భూములను జప్తు చేసి భూమిలేని వ్యవసాయదారులకు పంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగు భూములను విచ్చలవిడిగా ఇతర అవసరాల కోసం మల్లించడం ఆపాలని కోరారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి మాట్లాడుతూ..విద్యను ఎలాగైతే ధ్వంసం చేశారో వ్యవసాయ రంగాన్ని కూడా కెసిఆర్ ధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. కౌలు రైతులకు చట్టం ఉన్నప్పటికీ దాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవడం తీవ్రమైన అన్యాయం అన్నారు. కౌలు రైతులు ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని వారిని గుర్తించకపోవడం దారుణం అన్నారు. భూమిలేని వారే ఎక్కువగా కౌలు రైతులుగా ఉన్నారని అలాంటి వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరం అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు రైతు బంధు, పంటరుణాలు ఇవ్వాలని ఇతర ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు రోడ్లమీదకు వొస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. దుర్మార్గపు పరిపాలనపై జిల్లాల్లో పర్యటించి ప్రజలకు చెప్పాలన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాల్ రావు మాట్లాడుతూ 2011 లో కౌలు రైతుల గుర్తింపు చట్టం తీసుకురావడంలో తాను కూడా ప్రధాన భూమికను పోషించానని అన్నారు. కౌలు రైతులకు చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడంతో వారు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించని వ్యవసాయరంగ సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 36 శాతం అనగా 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పారు. కౌలు రైతుల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్యవేదిక ప్రతినిధులు విస్సా కిరణ్, కన్నెగంటి రవి, డాక్టర్ చెరుకు సుధాకర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డి.నర్సింహరెడ్డి, వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, బి.కొండల్ రెడ్డి, శ్రీహర్ష, బీఎస్పీ నాయకులు అరుణ, దయాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులరాళ్లు కోట నీలిమ, తెలంగాణా విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య, దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి పి.శంకర్, తెలంగాణా రైతాంగ సమితి అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, మకాం నాయకులు, ఉషా సీతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




