వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏంటో తెలుసుకుందామా!
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. కోటి పుణ్యాలకు సాటి.. ఒక ముక్కోటి ఏకాదశి అని పెద్దల సూక్తి.. ఈ పండుగ తెలుగు నెలల ప్రకారమే జరుపుకున్నా.. ప్రతి ఏడాది డిసెంబర్ నెలాఖరు లేదా.. జనవరి నెలలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజు వేకువనే లేచి, తల స్నానం చేసి.. ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయం. అసలు ముక్కోటి ఏకాదశి ఏమిటి ? ఎందుకు ఈరోజే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనార్థం వేచి ఉంటారు. ఇవాళ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని అంటారు.
ఈ ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానంగా పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పెద్దలు వచిస్తారు.. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయట. ఈ రోజునే శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం పంచాడు… మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడట. విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.




