కేసీఆర్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు

పాలన చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వం
తెలంగాణలో బీఆర్ఎస్‌ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యం
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్‌ లో చేరారు
నీళ్ళు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ విఫలం
ఒక్క గజ్వేల్‌లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులున్నారు
బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్
హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 06 : కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులతో పాటు ఎవరూ సంతోషంగా లేరని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్‌ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టియూడబ్ల్యూజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ సారధ్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కి హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ‘బీసీ బంధు’ దక్కిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. ప్రభుత్వం పాలన చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, అసైన్డ్, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని అన్నారు. మరోపక్క, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్‌ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యమన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకు రావాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు బీఆర్ఎస్‌లో చేరారన్నారు. నీళ్ళు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ సంపూర్ణంగా విఫలమయ్యారని అన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట తక్కువ ధరలకు కేసీఆర్ ఫ్యామిలీ తీసుకుందని ఆరోపించారు. ఒక్క గజ్వేల్‌లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీని ఓడించడం బీజేపీకే సాధ్యం అని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కమలం పార్టీతోనే సాధ్యమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అన్నారు. గతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి పని చేశాయని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తుంటే తెలంగాణలో మాత్రం ఆ భూమలను లాక్కుంటున్నారని అన్నారు. భూములను లాక్కొని దళితులను రోడ్డున పడేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ఎక్కడ భూములు అవసరమైనా అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 40, 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు ఇవ్వట్లేదని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *