కేంద్రంపై  అణగారిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత

ఆ భయంతోనే కులగణనకు మోదీ అంగీకారం
బీహార్‌ ‌పర్యటనలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు

దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ కులగణనకు అంగీకరించారని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడ్డారని అన్నారు. బిహార్‌లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేవలం 5శాతం మంది ప్రజల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదని, కార్పొరేట్‌ ‌వ్యక్తులకే మోదీ గవర్నమెంట్‌ ‌వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణలో చేపట్టిన విధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌కోసం కేటాయించిన నిధులను విడుదల చేయాలని రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా వీటిని సాకారం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

తాను ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు స్థానిక నేతలు, అధికారులు ఎంతో ప్రయత్నించారని అన్నారు. అన్ని అడ్డంకుల్నీ అధిగమించి వొచ్చానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో బిహార్‌ ‌శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే బిహార్‌లో యువతతో మమేకమయ్యేందుకు తలపెట్టిన ‘శిక్షా న్యాయ్‌ ‌సంవాద్‌’ ‌కార్యక్రమాన్ని రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మిథిలా వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు అధికారపార్టీ నాయకులు, అధికారులు ఎంతో ప్రయత్నించారు. యూనివర్సిటీ గేటు బయటే నా కారును నిలిపివేశారు. అయినా, నేను వెనకడుగు వేయలేదు. నడుచుకుంటూ సభా వేదిక మీదికి చేరుకున్నాను.   అందరి అభిమానమే నన్ను ముందుకు నడిపించింది. ఇదే శక్తి నరేంద్ర మోదీని గద్దె దించుతుందని రాహుల్‌ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కాకుండా…అంబానీ, అదానీల కోసమే పని చేస్తోందని రాహుల్‌ ‌విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *