- భర్తరఫ్ చేయాల్సింది టీఎస్పీఎస్సీని కాదు సిఎంని
- తెలంగాణ బాగుపడాలంటే బిజెపిని ఆశీర్వదించండి
ఆదిలాబాద్ బీజేపీ జనగర్జన సభలో ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : తెలంగాణ రాష్ట్రం కోసం ఇరవై నాలుగు గంటల సమయం నేషనల్ హైవే దిగ్బంధం చేసిన వారు ఇక్కడికి వొచ్చిన వారిలో ఎంతో మంది ఉన్నారని..తాను చచ్చిపోయినా పర్లేదు తన తోటి వారికైనా ఉద్యోగాలు వొస్తాయని ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని..ఆ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడితే ఆ ఫలితాలు అనుభవిస్తుంది కేసీఆర్, ఆయన కుటుంబం, వారి చుట్టాలు మాత్రమేనని ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో మంగళవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ జనగర్జన సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ…మొన్న వొచ్చిన వరదల్లో ఆదిలాబాద్‌లో ఉన్న స్వర్ణవాగు, గడ్డనవాగు పొంగి పక్కనున్న పొలాలు అన్ని మునిగిపోయి నష్టపోయిన మహిళలు కార్చిన కన్నీళ్లు ఇప్పటికీ మర్చిపోలేదని, వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేసీఆర్ వేరే రాష్ట్రాల్లో మన డబ్బులు పంచిపెడుతున్నారని విమర్శించారు.
30 లక్షల మంది తెలంగాణ యువకులకు అన్యాయం చేసింది కేసీఆర్ అని, భర్తరఫ్ చేయాల్సింది టీఎస్పీఎస్సీని కాదని సిఎంగా కేసీఆర్‌ని బర్తరఫ్ చేయాలన్నారు. కెసిఆర్‌ని గద్దెదించితేనే మనకు ఉద్యోగాలు వొస్తాయని, అప్పటివరకు మనం నిద్రపోవద్దని ఈటల ప్రజలకు పిలుపునిచ్చారు. స్వరాష్ట్రం వొస్తే తెలంగాణ ఆడబిడ్డలంతా లక్షాధికారులు అవుతారని కేసీఆర్ చెప్పారని, కానీ వడ్డీ లేని రుణాల పైసలు కూడా ఇవ్వడం లేదని ఈటల దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద వారి వాటా ఠంచన్‌గా మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నా.. నాలుగు సంవత్సరాలు అయినా కేసీఆర్ డబ్బులు వారికి ఇవ్వడం లేదని, దాంతో బ్యాంకులలో మహిళా సంఘాల గ్రూపులు డిఫాల్టర్‌గా మిగిలిపోతున్నారని, మహిళలు రుణాలు తీసుకోవడానికి వీలు కాకుండా పోవడానికి కేసీఆరే కారణమన్నారు. బిజెపి అధికారంలోకి వొస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లేని రుణాల పైసలు చెల్లించే జిమ్మేదార్ తమదని హామీ ఇచ్చారు.
వివోఏ లకు 5 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, బిజెపి వొస్తే వారికి అండగా ఉంటుందన్నారు. ధనిక రాష్ట్రం, రైతుల కోసం పుట్టిన, రైతుల కోసం పనిచేస్తున్న అని చెప్పిన కేసీఆర్ నాలుగున్నర సంవత్సరాలు అయినా రైతులకు రుణమాఫీ డబ్బులు విడుదల చేయలేదని మండిపడ్డారు. 7800 కోట్లకు రింగ్ రోడ్డు అమ్మి, మద్యం టెండర్లు వేసి, భూములు కుదువ పెట్టి డబ్బులు తెచ్చి రైతులకు రుణమాఫీ డబ్బులు ఇస్తున్నారన్నారు. పెన్షన్ సకాలంలో ఇవ్వడం లేదని, రైతుబంధు పూర్తి చేయలేదని, తెలంగాణ అప్పుల కుప్పగా మారింవని, దీని నుంచి బయటపడాలంటే..తెలంగాణ బాగుపడాలంటే కెసిఆర్ ప్రబుత్వాన్ని బొంద పెట్టాలన్నారు. దళిత ముఖ్యమంత్రి ఇస్తానని మోసం చేసిన కేసీఆర్.. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఈటల ఆరోపించారు. టిఆర్ఎస్ ఉన్నంత కాలం కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అవుతారు తప్ప వేరే వారికి అవకాశం లేదన్నారు. 52 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారని, అన్ని వర్గాలను కెసిఆర్ అవమానపరిచారని, కేసీఆర్ కి బుద్ధి చెప్పాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీని గెలిపించడమేనని, బిజెపిని ఆశీర్వదిస్తే రేపటి బంగారు తెలంగాణకు బాటలు వేసే బాధ్యత తమ పార్టీ తీసుకుంటుందని ఈటల భరోసా ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ రావాలన్నా, పెన్షన్ కొనసాగాలన్నా, చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావాలన్న..ఇచ్చే సతా..శక్తి బిజెపికి మాత్రమే ఉందని, బిజెపిని గొప్ప మెజారిటీతో గెలిపించాలని ఈటల రాజేందర్ కోరారు.





