రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి
13న నల్గొండలో భారీ బహిరంగ సభద ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష
హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు
ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 06 : తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా..కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ…కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13 న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారని పార్టీ కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని కెసిఆర్ స్పష్టం చేశారనీ పేర్కొంటూ..నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తి తోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమకారులదే నని తన లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబికి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని, కాంగ్రేస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూన్నామని, ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని నిలదీస్తామని బిఆర్ఎస్ అధినేత ప్రకటించారు. మంగళవారం తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రముఖులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్భంగా..కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్యులతో కీలక సమావేశంలో…కృష్ణా నదిపై ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి తలెత్తే నష్టాలు పర్యవసానాలపై చర్చించారు. కృష్ణా ప్రాజెక్టులు నదీ జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు.. రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేఖ వైఖరిపై చేపట్టవలసిన తదుపరి కార్యాచరణపై చర్చ..అందుకు సంబంధించి అధినేత దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో సాగునీరు, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా ‘‘మా నీళ్లు మాకే ‘‘ అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూయించిన ఘనత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
కేఆర్ఎంబి పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ.. కేంద్రం వత్తిళ్ళను తట్టుకుంటూ పదేండ్ల పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిరదన్నారు. కానీ కాంగ్రేస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడుతామన్నారు. తద్వారా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగునీరు అందక తిరిగి కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై, ప్రాజెక్టులపై తెలంగాణకు రావలసిన వాటాను, హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశం తీర్మానించింది. ఈ సమావేశం లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జి జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ, సత్యవతి రాథోడ్‌లతో పాటు ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఎంపీలు, జెపి చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ మున్సిపల్ చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారనీ పేర్కొన్నారు.
ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్ రావు
అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ భవన్‌కు వొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ ఫామ్ హౌజ్‌లోని తన నివాసంలో కిందపడటంతో హాస్పిటల్లో తుంటి ఎముక సర్జరీ అనంతరం కేసీఆర్ ఇటీవల కోలుకున్నారు. దీంతో ఈనెల 2న అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత పార్లమెంటరీ సవిూక్షా సమావేశాల్లో కేసీఆర్ తరచూ పాల్గొంటున్నారు. ఇక కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వొస్తున్నారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ సీఎం..కేసీఆర్ సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మహిళా నేతలు ఆయనకు తిలకం దిద్దారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని, ఇచ్చిన హావిూల అమలుపై కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్‌ను ఇక ప్రజలు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు, ప్రజానాయకుడు, రానేరాదన్న తెలంగాణను 14ఏళ్లు పోరాడి సాధించిన నేత కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధికోసం అలుపెరగని పోరాటం చేస్తారు, రాబోయే రోజుల్లో విూరే చూస్తారు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు ప్రజల కష్టాలు పట్టడం లేదు..ప్రజలకు కష్టాలు పెరగడమే కాంగ్రెస్ ప్రభుత్వంతో వొచ్చిన మార్పు అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.





