చర్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 30 : భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సెలమల సిఆర్పిఎఫ్ క్యాంపుకు కూతవేటు దూరంలో ఉన్న కుర్నపల్లి పంచాయతీ ఉప సర్పంచ్ ఇర్ఫా రాముడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వొచ్చింది. సోమవారం కొందరు సాయుధ మావోయిస్టులు రాముడి ఇంటి వద్దకు వొచ్చి రాముడుని తీసుకువెళ్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుపడి కాలు, వేలు పట్టుకొని బతిమిలాడినా వదిలిపెట్టలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాముడిని దారుణంగా హత్య చేసి మృత దేహాన్ని రహదారి పక్కన పడవేసి మృతుని వద్ద లేఖను వొదిలి వెళ్లారు. గత కొంతకాలం నుండి పోలీసులకు ఇన్ ఫార్మర్గా మారి తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని, టిఆర్ఎస్ పార్టీ నాయకులతో తిరుగుతున్నాడని, ఆ కారణంగానే రాముడుని హత్య చేశామని లేఖలో పేర్కొన్నారు. పోలీసులకు ఇన్ ఫార్మర్గా మారిన ఎవరికైనా ఇదే గతి పడుతుందని లేఖలో వారు హెచ్చరించారు.


