గ్వాలియర్, ఫిబ్రవరి 18 : దేశంలో చీతాల సంఖ్య మరింత పెరిగింది. దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా 12 చీతాలను శనివారం భారత్‌కు తీసుకొచ్చారు. ఈ వన్యప్రాణులను తీసుకుని జోహన్నెస్‌బర్గ్ నుంచి బయల్దేరిన వాయుసేనకు చెందిన సీ-17 విమానం ఈ ఉదయం గ్వాలియర్ ఎయిర్‌బేస్‌లో దిగింది.
అక్కడి నుంచి ఈ చీతాలను శ్యోపూర్ జిల్లాలోని కునో జాతీయ పార్కుకు తరలించారు. శనివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసారు. ఇందులో ఏడు మగ, అయిదు ఆడ చీతాలున్నాయి. వీటి కోసం కునో పార్కులో పది క్వారంటైన్ ఎన్క్లోజర్లను సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం నెల రోజుల పాటు వీటిని క్వారంటైన్లో ఉంచనున్నారు.




