కాళోజీ యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికేట్‌లతో ఎంబిబిఎస్‌ ‌సీట్లు

గుర్తించిన యాజమాన్యం..ఏడుగురు విద్యార్థుల అడ్మిషన్‌ ‌రద్దు
వరంగల్‌(ఎం‌జిఎం), ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌వరంగల్‌లోని కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికేట్ల దందా వెలుగు చూసింది. నకిలీ స్థానిక ధ్రువపత్రాలతో కాళోజీ నారాయణ హెల్త్ ‌యూనివర్సిటీలో 2023-24 కౌన్సిలింగ్‌లో ఎంబీబీఎస్‌ ‌సీట్లు పొందారు. ఏడుగురు ఏపీకి చెందిన విద్యార్థులు. అయితే వీరి స్థానికతపై అనుమానం వొచ్చిన యూనివర్సిటీ యాజమాన్యం వీరి సర్టిఫికేట్‌లు పరిశీలించగా నకిలీవని తేలింది. దీంతో ఏడుగురు విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేశారు. ఏపీకి చెందిన పోపులు సుబ్రహ్మణ్యసాయి, వానిపెంట ప్రీతికారెడ్డి, తమ్మినేని విష్ణుతేజ, తన్నీరు సంజయ్‌, అరికట్ల హనుమాన్‌రెడ్డి, టేకులపల్లి మహేష్‌, ‌గేర్లే భార్గవ్‌ ‌యశ్వంత్‌ అడ్మిషన్స్‌ను రద్దు చేసింది. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్‌  ‌డాక్టర్‌ ఎస్‌.‌సంధ్య ఫిర్యాదుతో వీరికి సర్టిఫికేట్లు అందించిన సూత్రధారి కామిరెడ్డి నాగేశ్వర్‌రావుపై మట్టెవాడ పోలీస్‌ ‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, ‌బీడీఎస్‌ ‌ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఈ క్రమంలో ఏపీకి చెందిన ఈ ఏడుగురు విద్యార్థులు నకిలీ స్థానిక ధ్రువపత్రాలు సృష్టించి..ఎంబీబీఎస్‌ ‌సీట్లు పొందారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదివినట్టు సర్టిఫికెట్లు పొందుపరిచారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇలా చదివితే లోకల్‌ అభ్యర్థుల కింద సీటు పొందొచ్చు. దీంతో వీరంతా స్థానిక కోటాలో వర్సిటీలో సీట్లు పొందారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఏపీలో చదివారు. నీట్‌ ‌పరీక్ష కూడా ఆంధప్రదేశ్‌ ‌నుంచే రాయడంతో అధికారులకు అనుమానం వొచ్చింది.

ధ్రువపత్రాలతో ప్రత్యక్షంగా వర్సిటీకి రావాలని విద్యార్థులను వివరణ కోరగా..వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. విజయవాడలోని ఒక ఏజెన్సీ నడిపే కామిరెడ్డి నాగేశ్వరరావు అనే వ్యక్తి తమకు తెలియకుండా ధ్రువపత్రాలు పొందుపరిచారని అధికారులకు తెలిపారు. దీంతో ఈ ధ్రువపత్రాలు నకిలీవని తేల్చిన వర్సిటీ అధికారులు వీరి ప్రవేశాలను రద్దు చేశారు. సూత్రధారి నాగేశ్వరరావుతో పాటు ఏడుగురు విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా విద్యార్థుల వాదన మరోలా ఉంది. తాము ఒరిజినల్‌ ‌సర్టిఫికేట్‌లే అందించామని ఏజెన్సీ నిర్వాహకులే నకిలీ సర్టిఫికేట్లు మార్చారని ఆరోపించారు. పోలీసుల విచారణలో నిజాలు తెలుస్తాయని యూనివర్శిటీ అధికారులు తెలిపారు.

హెల్త్ ‌యూనవర్సిటీ ఎదుట ధర్నా
ఎంబీబీఎస్‌ ‌మొదటి సంవత్సరం కౌన్సిలింగ్‌లో నాన్‌ ‌లోకల్‌ ‌కేటగిరీ సీటు కేటయింపులో అవకతవలు జరిగాయని ఆరోపిస్తు శనివారం యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఏపీలోని కడపకు చెందిన విద్యార్థి సాయి, రేవంత్‌ ‌కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *