- తెచ్చిన అప్పులతో ఇష్టారీతిగా ఖర్చులు
- ఆదాయవనరులు చూపి సంస్థలను మోసగించారు
- ఆర్బిఐ, కాగ్ నివేదికలే సాక్ష్యం
- కాళేశ్వరం పేరుతో 97,448 కోట్ల రుణం
- కెసిఆర్ కుటుంబం గుప్పిట్లో నీటిపారుదల శాఖ
- మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సిఎం రేవంత్
- అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదని హెచ్చరిక
- సిఎం రేవంత్, హరీష్ రావుల మధ్య వాగ్వాదం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : కాళేశ్వరం ప్రాజెక్టును 80 వేల కోట్లతో కట్టామనడం అబద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఇతరులెవరూ సాగునీటి పారుదల శాఖకు మంత్రులుగా పని చేయలేదన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే 97,448 కోట్లు మంజూరైందన్నారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుందన్నారు. ప్రభుత్వం అడ్డుగోలుగా అప్పులు తెచ్చింది కాకుండా…ఇప్పటి ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించి కాగ్, ఆర్బిఐ నివేదికలు కూడా ఉన్నాయని అన్నారు. బుధవారం సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ…అవాస్తవాలతో హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
సభను తప్పు దోవ పట్టించే విధంగా సభ్యులు ఎవరైనా మాట్లాడినా, సమాచారం ప్రవేశపెట్టిన ఎలాంటి చర్యలు తీసుకోవాలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించాలని కోరారు. కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం నీటితోనే ఏటా 5వేల కోట్లు సంపాదిస్తామని చెప్పారని సభకు తెలిపారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి, అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం విధానాన్ని మార్చుకోవాలంటూ కాగ్ మొట్టికాయలు వేసిందన్నారు. మిషన్ భగీరథతో 5,700 కోట్లు సంపాదిస్తామని, బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చి రుణాలు తెచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథతో 10వేల కోట్లు వసూలు చేస్తామని నివేదికలు ఇచ్చారని తెలిపారు. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సొంత ఆదాయ వనరులతో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపామన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన 42 పేజీల శ్వేతపత్రంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామన్నారు. ‘విూ విజ్ఞతను వినియోగించి సంపదను సమకూర్చుకోండి.. కానీ మా విూద నెపం నెట్టి తప్పించుకోకండి. రాష్ట్ర పరపతిని దిగజార్చకండి. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయకండి’ అంటూ హరీష్‌రావు హితవుపలికారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ..2014నుంచి 16వరకు హరీష్ రావు నీటిపారుదుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు వారి కుటుంబం తప్ప మరెవరు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు కాదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు రూ.97,449 కోట్లు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఖర్చు చేసింది. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014కు ముందు ప్రజలు మంచినీరు తాగలేదా…అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ వొచ్చాకనే మంచినీళ్లు తాగినట్లు చెబుతున్నారన్నారు. మిషన్ భగీరథ వల్ల ఐదు వేల కోట్ల ఆదాయం వొస్తుందని మభ్యపెట్టి లోన్లు తెచ్చారని, అప్పులు చేసిన విషయాన్ని అంగీకరించకుండా దబాయిస్తున్నారని, అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చారని కాగ్ చెప్పిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.





