- బాధ్యుడైన కేసీఆర్‌పై చర్య తీసుకోవాలి
- నిర్మాణం డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయటపెట్టింది
- ప్రాజెక్టుపై బిజెపి ఎందుకు మౌనంగా ఉంటున్నది
- సీబీఐచే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి
- అధికారంలోకి వొచ్చాక కెసిఆర్‌కు ఆశలు, ఆలోచనలు పెరిగాయి
- కోదండరామ్ కూడా తెలంగాణ వ్యతిరేకియేనా..?
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 04 : కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలి అయిపోయిందనీ, అయన ఓ ఆర్థిక ఉగ్రవాది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. డిజైన్ అనుకున్నది ఒకటైతే..నిర్మించింది మరొకటైందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయటపెట్టిందన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్ని తానే అని రక్తం ధారపోసి కట్టానని కేసీఆర్ చెప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రేవంత్ రెడి మీడియాతో మాట్లాడుతూ…మేడిగడ్డ బ్యారేజీ ప్రణాళిక ప్రకారం డిజైన్ చేయలేదని, డిజైన్ ప్రకారం నిర్మాణం లేదని, నిర్మాణం ప్రకారం నిర్వహణ లేదని, కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైందని, మేడిగడ్డ కుంగిందని, కేసీఆర్ పాపం పండిందని విమర్శించారు. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్…ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వొచ్చేది కాదని, ఇంత జరిగినా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పై నోరు మెదపలేదని, నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం వివరాలను దాచిపెట్టిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
2014 నుంచి 2018 వరకు హారీష్ రావు దగ్గర నీటిపారుదల శాఖ ఉందని, 2019 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ దగ్గరే ఉందన్నారు. కాళేశ్వరం మీద ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని రేవంత్ ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఒప్పందంలో ఒక రేటు, పనులు ప్రారంభించిన తర్వాత రివైజ్డ్ పేరిట అంచనాలను పెంచుకుంటూ కమీషన్లను దండుకుంటున్నారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టును ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఒప్పంద సమయంలో నిర్మాణ వ్యయం రూ. 270 కోట్లుగా కాగా తర్వాత దాన్ని రివైజ్డ్ కింద రూ. 500 కోట్లకు పెంచారని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను కేసీఆర్ బంధువుకు చెందిన ప్రతిమ సంస్థకు ఇచ్చారన్నారు. అగ్రిమెంట్ సమయంలో తక్కువ ధరకు ఇచ్చి.. రేవైజ్లో ధర పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాళేశ్వరంలో కూడా రూ. 80 వేల కోట్లు అగ్రిమెంట్లో పెట్టి రూ. లక్ష 50 వేల కోట్లకు అంచనాలను పెంచారని తెలిపారు. ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అంటూ నిప్పులు చెరిగారు.
ఈ టెర్రరిస్టులను కేంద్రం వెంటనే శిక్షించాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో ఇంత ఉపద్రవం జరిగినా కేసీఆర్ మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. డిజైన్ల లోపాలు, నాసిరకం పనులు జరిగాయని ప్రభుత్వానికి తెలుసని ఆరోపించారు. కాళేశ్వరం జరిగిన అవినీతి కేంద్రం ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్ర ఎందుకు మౌనంగా ఉంటోందని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాళేశ్వరంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. నిర్మాణాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోయింది.. బాద్యులపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పారు. కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగిందని..కేసీఆర్ పాపం పండే రోజులు దగ్గరపడ్డాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వొచ్చాక ఆయన ఆలోచనలు మారి..ఆశలు పెరిగాయన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ అనే పదం కనిపెట్టారని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాచారం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్‌ని కాపాడేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణకు చెందని అధికారులతో ఓ కమిటీని వేసి..ఆ కమిటీతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్నీ పరిశీలించి నివేదిక ఇవ్వాలనీ, దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. అలాగే…2014-2023 వరకూ కాళేశ్వరం వెనక మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్ ఉన్నారన్న ఆయన..వారిద్దర్నీ వెంటనే పదవుల నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బండి సంజయ్‌ని పదవి నుండి తప్పించిన తర్వాత బిజెపి నేతలకు బుర్ర పని చేస్తున్నట్టు లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర జలశక్తి మంత్రి పరిధిలో ఉండే కమిటీనే..తప్పు జరిగిందని చెప్పిందన్నారు. అవినీతిని వదలను అని చెప్పే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నాడంటూ రేవంత్ ప్రశ్నించారు.
నివేదిక మీద చర్యలు తీసుకో అంటే..రాష్ట్రంలో అధికారం లోకి వొస్తే చర్యలు తీసుకుంటా అని చెప్పడం ఏంటని, అంటే బీజేపీ అధికారంలోకి రాదు..విచారణ జరపం అని చెప్పదలుచుకున్నదా బీజేపీ అని ప్రశ్నించారు. తప్పు సరిదిద్దుకోవడం మానేసి..రాహుల్ గాందీని, తనను తిడుతున్నారని కేటీఆర్‌పై మండిపడ్డారు. రిటైర్ అయిన అధికారి మురళీధర్ రావుకు బాధ్యతలు ఇచ్చి తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఎన్నికల పర్యటనకు వొస్తున్నారు కానీ..కూలిన ప్రాజెక్టు చూడడానికి ఎందుకు రావడం లేదని రేవంత్ ప్రశ్నించారు. మోదీ పరిశీలించి..చర్యలకు అదేశించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల పర్యటన కాదు..మేడిగడ్డ పర్యటన చేసిన తర్వాతనే వోట్లు అడగండని తెలిపారు. కోదండరామ్ కూడా తెలంగాణ వ్యతిరేకేనా అంటూ ప్రశ్నించారు. ఆయన్ని తెలంగాణ వ్యతిరేకి అంటే జనం చెప్పుతో కొడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట టీడీపీ సంక నాకింది బీఆర్ఎస్యేనని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు బీఆర్ఎస్లో చేరాడన్నారు. టీడీపీ మీద దాడి చేసినప్పుడు ఒకలా..తర్వాత ఇంకోలా మాట్లాడుతుంది బీఆర్ఎస్ అన్నారు. కేఏ పాల్ కూడా పోటీ చేయడం లేదని, పాల్ బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టా.. అంటూ ప్రశ్నించారు. మాట్లాడటానికి బుద్ది ఉండాలంటూ మండిపడ్డారు. డిసెంబర్ 9 తర్వాత కాళేశ్వరం బాధ్యుల తాటా తిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రాజెక్టు అంచనాలు, పెంచిన వ్యయం, ఖర్చు..ఈ మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.





