కాంగ్రెస్‌ ‌పార్టీతోనే మహిళా సాధికారత

  • కేసిఆర్‌కు మహిళల పట్ల చిన్నచూపు
  • పొదుపు సంఘాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం
  • కేంద్రంలో మహిళా బిల్లును బిజెపి అడ్డుకున్నది
  • స్వయం సహాయక సంఘాల సమావేశంలో రేవంత్‌ ‌రెడ్డి

చిట్యాల(భూపాలపల్లి), ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 22 : కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వాలు మహిళల పట్ల వివక్ష చూపుతూ మహిళా సాధికారతకు అడ్డుగోడగా నిలుస్తున్నాయని కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారతలో భాగంగా ఉభయ సభల్లో మహిళా బిల్లును ప్రవేశపెడితే నరేంద్ర మోడీ అడ్డుకున్నారని ఆరోపించారు. దేశంలో ఉక్కు మహిళగా పేరు ఉన్న ఇందిరాగాంధీ, త్యాగశీలిగా పేరు గడించిన సోనియా గాంధీ తమ పరిపాలనలో మహిళల కోసమే పరితపిస్తూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలను ముందంజలో నిలిపారని గుర్తుచేశారు. హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో కార్యక్రమంలో భాగంగా బుధవారం చిట్యాల శివారు వెంకట్రావుపల్లి(సి)లో వేలాదిగా హాజరైన మహిళా సంఘాల సభ్యులతో రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడారు. గణపురం జడ్పిటిసి సభ్యురాలు గండ్ర పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మహిళలకు భద్రతా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో బిజెపి, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాలు మహిళలను వంటింటికే పరిమితం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలో దేశంలో దిల్లీ సీఎంగా షీలా దీక్షిత్‌, ‌భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్‌ ‌నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు రాజకీయరంగంలో ప్రాధాన్యత లేకుండా పోయిందని, మహిళలు చైతన్యమైతే తమ నాయకత్వానికి అడ్డు వొస్తుందనే ఉద్దేశంతోనే బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపిస్తుందని విమర్శించారు. నిజామాబాదులో కెసిఆర్‌ ‌కూతురు కవితను ఓడిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు చోటు దక్కిందని వివరించారు. రాబోయే తమ ప్రభుత్వంలో నలుగురు మహిళలతో మంత్రివర్గం ఉంటుందని ప్రకటించారు. స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం చేసి, పావలా వడ్డీ రుణాలు రద్దుచేసి, అభయహస్తం డబ్బులు తిరిగి ఇవ్వకుండా మహిళలను ఇబ్బందులపాలు చేస్తున్నదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువై నిత్యం ఆకృత్యాలు జరుగుతున్నాయని వాపోయారు. మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన ప్రభుత్వాలు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బెల్ట్ ‌షాపులు జోరుగా పెరగడంతో మహిళలు ఇబ్బందుల పాలవుతున్నారని గుర్తు చేశారు. చివరికి 14 ఏళ్ల పిల్లలు కూడా మద్యం తాగే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని ఆవేదన చెందారు. తల్లులు తమ పిల్లల పట్ల అశ్రద్ధ చేయకూడదని, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన ఎదుర్కునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

వంట నూనె ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, ఇంటి యజమాని పని చేస్తే వొచ్చే డబ్బులు బెల్ట్ ‌షాపులకే సరిపోతున్నాయని గుర్తు చేశారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలు తగ్గించాలంటే కాంగ్రెస్‌ ‌పార్టీకి మద్దతు ఇవ్వాలని రేవంత్‌ ‌రెడ్డి కోరారు. కుటుంబం బాధ్యత మహిళలకే అధికంగా ఉంటుందని, మహిళలు విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు డాక్టర్‌ ‌మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ ‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *