హైదరాబాద్, సెప్టెంబర్ 25 : సమాజంలో అధికశాతం జనాభా కలిగిన బలహీన వర్గాల పట్ల ఇంతకాలం రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని, ఇక ఎంతోకాలం ఈ అన్యాయాన్ని సహించేదిలేదంటున్న బీసీలు ఉద్యమించేందుకు సిద్దపడుతున్నారు. గత కొంతకాలంగా పార్టీలకు బిన్నంగా బీసీ నేతలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైనారు. ఆయా పార్టీలలో జనభా ప్రాతిపదికన(మేమెంతో…మాకు అంత అన్న నినాదంగా) బీసీలకు సీట్లు కేటాయించాలన్న డిమాండ్ వారు ముందుకు తీసుకువస్తున్నారు. అంతేగాక పార్టీలేవైనా ఎన్నికల్లో నిలబడే బిసీ నేతలను గెలిపించుకోవడం ద్వారా తమ ఐక్యతను చాటుకోవాలని వారు పిలుపునిస్తున్నారు. వాక్ స్వాతంత్య్రం ఎక్కువగా ఉంటుందనుకుంటున్న కాంగ్రెస్‌లో ఈ పంచాయితీ ఇప్పుడు తారస్థాయికి చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒక వైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో పోటీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే విషయంలో మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీముందు ఇదొక పెద్ద సమస్యగా తయ్యారైంది.
ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో గెలుస్తామన్న నమ్మకాన్ని ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నది. అందుకోసం గెలుపు గుర్రాలకే టికట్లు కేటాయించే దిశగా జాబితా తయారీలో తలమునకలైంది. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్న క్రమంలో బిసీ నేతలు చేస్తున్న డిమాండ్ ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. ఒక వైపు ఒక్కో నియోజకవర్గం నుండి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురు టికట్ కోసం దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోని పక్షంలో తమదారి తాము చూసుకుంటామన్న బెదిరింపులను ఇప్పటికే పార్టీ ఎదుర్కుంటున్నది. ఇంకా ఆ వివాదానికి తెరపడకముందే బిసీ నాయకుల వత్తిడి పార్టీపైన పెరిగింది. సామాజిక న్యాయం గురించి మాట్లాడటమేకాదు, అమలు చేసి చూపించాలంటున్నారు బిసీ నేతలు. సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న బిసీల కన్నా, తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలకు సీట్ల కేటాయింపన్నది చాలాకాలంగా జరుగుతున్నది. ముఖ్యంగా రెడ్లకు అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడం పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీట్ల కేటాయింపులోనే కాదు, పార్టీ కార్యక్రమాల్లో కూడా ఈ వివక్షత కొనసాగుతున్నదంటున్నారు బిసీ నాయకులు.
తాజాగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో ఒక్కరంటే ఒక్క బీసీ నేతను తీసుకోలేదు. అలాగే రానున్న ఎన్నికల్లో అభ్యర్ధిత్యం కోసం వొచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ కమిటీలో కూడా ఒక్క బీసీకి అవకాశం కలిగించక పోవడాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. బీసీ వోటర్లు అధికంగా ఉన్న స్థానాల్లో సర్వే నివేదికలను ఆధారం చేసుకుని బీసీఏతరులకు కేటాయించే ఆలోచనలో పార్టీ ఉండటాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్వే ప్రకారం టికెట్ పొందిన వ్యక్తి గెలుస్తాడన్న నమ్మకం ఖచ్చితంగా ఉంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. బహుజనుల పాత్ర లేకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అసంభవమన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలను పక్కకు పెట్టి, సర్వేల పేరున వారి అభ్యర్థిత్వాన్ని నిరాకరిస్తే ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమంటున్నారు.
ఈ విషయాన్ని దిల్లీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయేందుకు బిసీ నేతలు సమాయత్తమవుతున్నారు. ఆదివారం గాంధీభవన్‌లో టీమ్ ఓబిసి నేతృత్వంలో జరిగిన బీసీ నేతల సమావేశం త్వరలో రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు తమ డిమాండ్‌ను తెలియజేసేందుకు ఈ రెండు రోజుల్లో దిల్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది మేలో రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేయాలని అధిష్టానాన్ని కోరనున్నారు. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కనీసం రెండు స్థానాలను బీసీలకు కేటాయించే విధంగా ఉదయ్‌పూర్‌లో పార్టీ తీర్మానించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దానివల్ల బిసీలకు కనీసం 34 స్థానాలు కెటాయించాల్సి ఉంటుంది. దీన్ని బట్టే రానున్న ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్, సురేష్ షెట్కార్, చెరుకు సుధాకర్‌గౌడ్, పీసీసీ ఫిషర్మెన్ కమిటీ, వికలాంగుల కమిటీ చేర్మన్లు మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొని పార్టీ బలపడడంలో బిసీల పాత్రను గుర్తుచేశారు. ఇదిలా ఉంటే బిసీలకు సరైన న్యాయం చేయాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి వారు బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. బిసీలకు సరిపడ టికెట్లు కేటాయించే విషయంలో అవసరమైతే తాను పోటీ చేయాలనుకుంటున్న నల్లగొండ శాసనసభ నియోజకవర్గాన్ని వదులుకోవడానికి కూడా సిద్దమేనని ప్రకటించారు.
అంతటితో ఆగకుండా బిసీలకు అవకాశం ఇచ్చేందుకు తనలాగా మరికొందరు ముందుకు రావాలని ఆయన పిలుపునివ్వడం ఆ పార్టీలో కొంత గందరగోళానికి దారితీసింది. ఇటీవల పార్లమెంటులో మహిళా బిల్లు అమోదం పొందిన నేపథ్యంలో మహిళలకు సముచిత కోటా కేటాయించేప్పుడు అవరసమైతే తన స్థానాన్ని వదులుకోవడానికి సిద్దమేనని రాష్ట్ర ఐటి శాఖమంత్రి కెటిఆర్ ప్రకటించిన విధంగానే కోమటిరెడ్డి కూడా బిసీ కోటాకు తన మద్దతును ఆ విధంగా ప్రకటించారనుకుంటున్నారు. అసలే ఒక కుటుంబం నుండి రెండు మూడు టికెట్లను డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో కోమటిరెడ్డి ప్రకటన ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపిందనే చెప్పాలె. ఇదిలా ఉంటే ఆత్మీయ సమ్మేళనం పేరున తీన్మార్ మల్లన్న అక్టోబర్ మొదటి వారంలో సుమారు అయిదు లక్షల మందితో బీసీల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.




