కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు వోటెయ్యండి..!!

  • గాడ్సేను ఆరాధించే మతతత్వ పార్టీ బిజెపి
  • జగిత్యాల జిల్లా మామిడి రైతులకు మేలు చేస్తా..
  • ఇక్కడికి పెప్సీ..కోకా కోలా ఫ్యాక్టరీ తెస్తా
  • జగిత్యాల, ధర్మపురి పర్యటనలో మంత్రి కెటిఆర్‌

జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు వోటేయాలని, ఈ విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఒకసారి ఆలోచించుకుని వొచ్చే ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి వోటేసి ఆశీర్వదించి కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ ‌ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన పనులను ప్రారంభించి బహిరంగ సమావేశాల్లో మంత్రి కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. కేటీఆర్‌ ‌రాక సందర్భంగా జగిత్యాల జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర హోమ్‌ ‌శాఖ మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ‌బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌జగిత్యాలలో మాట్లాడుతూ…భారత దేశంలో మొట్టమొదటి టెర్రరిస్టు గాడ్సే అని, జాతిపిత మహాత్మా గాంధీని చంపి గాడ్సేను ఆరాధించే మతతత్వ దుర్మార్గపు పార్టీ బిజెపి అని దుమ్మెత్తి పోశారు. గాడ్సేను ఆరాధించే పార్టీ బిజెపి మన దేశానికి అవసరమా అని ప్రజలను కేటీఆర్‌ ‌ప్రశ్నించారు.

ఇటువంటి అంటరాని కర్మ గాళ్ళ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం బీఆర్‌ఎస్‌కు లేనేలేదని మంత్రి కేటీఆర్‌ ‌ఖరాకండిగా చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌..‌ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. జగిత్యాల జిల్లా అవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా..అని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఇది సాధ్యమైందని అన్నా•రు. జగిత్యాలకు వైద్య కళాశాల తెచ్చుకున్నామని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలో సంజయ్‌ ఎన్నో సేవలు అందించారని మంత్రి కొనియాడారు. రైతులు నష్టపోకుండా జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తయారు చేశామని చెప్పారు. ఒక్క రైతు నష్టపోకుండా జగిత్యాలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ ‌జిల్లా వాసులకు హామీ ఇచ్చారు. మామిడి మార్కెట్‌ ఉన్న జగిత్యాలకు ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్లను తీసుకొస్తామని, సంజయ్‌ని మళ్ళీ గెలిపిస్తే ఈ ప్రాంతానికి పెప్సీ, కోకా కోల ఫ్యాక్టరీలలో ఏదైనా ఒక్కదాన్నీ తీసుకొచ్చే బాధ్యత తనేదేనని మంత్రి కేటీఆర్‌ ‌హామి ఇచ్చారు. సాగు నీటి కోసం, తాగునీటి కోసం ఊరికి ఊరికి మధ్య గతంలో కాంగ్రెస్‌ ‌వాళ్లు పంచాయతీలు పెట్టేవాళ్లని, వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రివర్స్ ‌పంపింగ్‌ ‌ద్వారా ఈ ప్రాంత ఆయకట్టుకును కెసిఆర్‌ ‌సస్యశ్యామలం చేశారన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌సజీవ జలధారగా మార్చారని అన్నారు. సమస్య పరిష్కరిద్దామంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గతంలో నిధులు కూడా ఇచ్చేవాళ్లు కాదన్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీకి ఒక ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 50 ఏళ్లు అవకాశం ఇచ్చారని, వాళ్లు చేసింది మీకు తెలియంది కాదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వోట్లు దండుకున్న మోదీ ఉద్యోగాలు ఇచ్చారా ఒకసారి నిలదీయండన్నారు. హిందూ ముస్లిం గొడవలు మత పిచ్చి గొడవలు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం వొచ్చాక 24 గంటల కరెంటు వొస్తుందా..లేదా.. అని ప్రజలను అడిగారు. తేదీ, సమయం చెబితే.. కాంగ్రెస్‌ ‌నేతలను తీసుకువచ్చి 24 గంటలు విద్యుత్‌ ‌వొస్తుందో లేదో చూపిస్తామని.. లేకపోతే ఒకసారి తీగలు పట్టుకుని చూస్తే కరెంట్‌ ‌వొస్తుందో లేదో తెలుస్తుందని కాంగ్రెస్‌ ‌నేతలను ఉద్దేశిస్తూ కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ‌నేతలు ఏమంటున్నారో రైతులు జాగ్రత్తగా వినాలని.. రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్‌కు అండగా నిలబడాలని కోరారు. ఈ ఊరికి, ఆ ఊరికి గొడవలు పెట్టింది కాంగ్రెస్‌ ‌నేతలు కాదా అని మంత్రి ప్రశ్నించారు. పదేళ్ల క్రితం పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తు చేసుకోండని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ‌వొచ్చిన తర్వాత తెలంగాణ రైతులు ఎంతలా అభివృద్ధి చెందారో యావత్‌ ‌దేశం చూస్తుందన్నారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తయారు చేశామని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగిత్యాల ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌భరోసానిచ్చారు. జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం నూకపల్లి శివారులో రూ.280 కోట్లతో నిర్మించిన 3,720 రెండు పడక గదుల ఇళ్లను పేదలకు పంపిణీ చేశారు. రూ.38 కోట్ల 40 లక్షలతో నిర్మించిన సమీకృత పోలీసు కార్యాలయ భవనాన్ని, నాలుగున్నర కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురిలో ఎనిమిదిన్నర కోట్లతో నిర్మించిన మాతాశిశు కేంద్రం, పైలాన్‌ ‌ప్రారంభించారు.

కేటీఆర్‌ ‌పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు
మరోవైపు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పర్యటన ఉండడంతో మెట్‌పల్లి, కోరుట్ల డివిజన్లలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. గత కొన్ని రోజుల నుంచి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ ‌చేస్తూ అంగన్‌వాడి కార్యకర్తలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఆశా వర్కర్లు ఎవరికి వారు వేదికలను ఏర్పాటు చేసుకుని సమ్మె చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ ‌పర్యటనను అడ్డుకుంటారనే అనుమానంతో మెట్‌పల్లి, జగిత్యాల, ధర్మపురి పోలీసులు రెండు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న పలువురు నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ ‌స్టేషన్లకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *