మనిషంటేనే ఒక లయగతిక ప్రతీక
జీవితమంటేనే చలనశీలం
దేహం కదులుతుంటేనే
ప్రాణం కాపురం చేస్తున్నట్టు
ఊపిరుంటేనే ఉనికికి చిరునామా
నడక మనిషి శ్వాస
ఆగక నడవడమే మన అస్తిత్వం
పయనం దారిలో పట్టుతప్పి
ఎదురు దెబ్బలెన్ని తగిలినా
పడిపోకుండా సాగటమే జీవితం
నడకలేని మనిషి జీవితం
ఎపుడైనా ఊహించగలమా?
తప్పటడుగులతో మొదలై
బుడి బుడి నడకలుగా సాగిన
పసితనం అందరికీ
మరపురాని మధురానుభూతే
ఎదిగే దారిలో పరుగులు తప్పని
పందెమే జీవన గమ్యమైతే
నీడలా తోడైన జత అడుగులు
ముందో వెనకో వదలక ఇష్టంగా
ప్రతిఅడుగులో వెంటనడుస్తుంటే
దారెంటా నవ్వులుపూస్తుంటాయి
మలితనాన ఆలసిన దేహం
బరువై అడుగులు తడబడినా
ఆసరాతోనో చేతికర్ర ఊతంతోనో
ఆగకసాగించే ఆఖరిమజిలీ అసలైననడక
బ్రతుకుతెరువు దారిలో
ఊరొదిలి పట్నం వలసవెళ్లే
పచ్చని పల్లె పాదాల
పగిలిన గాయాల నెత్తుటినడక
చీకటి బ్రతుకుల్లో వెలుగులు
నింపేందుకు పోరు బాటలో
అలుపెరగక అడుగులు వేస్తూ
కదిలిన వీరుల యుద్ధనడక
అన్యాయాలను ప్రతిఘటిస్తూ
గొంతెత్తి నిరసన తెలిపే
బిగించిన పిడికిళ్ళ ఆందోళనలతో
మార్పు సూరీడు ఉదయించే
తూర్పు దారుల్లోకి కవాతుగా
ఉప్పొంగే ఉరుకుల తిరుగుబాటునడకలు
రుక్ జాన నహీ తూ కహి హార్ కే
కాటోంపే చల్ కే
మిలేంగీ సాయే బహార్ కే
యూహి చలాచల్…ఓ రాహీ !
-డా.కె.దివాకరాచారి
9391018972




