ఓ మనిషీ తిరిగి చూడు!

ఓ మనిషీ తిరిగి చూడు!
నీ నిర్ధయను అడుగులెలా ముద్రించాయో
ఆ ముందుకెళ్ళే దారిలోనే వసంతం
వాడిపోయి శిశిరాలు మొల్చింది
నువ్వు నాటిన అదృశ్య కంటకాలు
పడగవిప్పి నాట్యమాడుతున్నాయి
మొండిగా వెళితే కాలుష్య కాసారాల్ని
కక్కుతాయిజి
ఆగిపో! దారి మార్చు
మానవత్వపు జాడలు కొసరుకైనా లేని
గతాన్ని ఓ మారు తవ్విచూడు..
శిథిలాల్లో వృథా అయిన కోట్ల వర్షపు చినుకులు
నముద్రాల్లో ఆత్మహత్య చేసుకుంటున్న నదులు
మూలుగుతూ ఏదో చెప్పాలని చూస్తూంటాయి
నోట్ల రెపరెపల్లో వినబడదు..
పుడమితల్లి గర్భాన్ని చీల్చి అభివృద్ధిపేరుతో
అవయవాలమ్ముకున్నావు కదా!
నువ్వు రంగులు మార్చి బతికిందే కాక
నదుల్ని నల్లగా అడవుల్ని తెల్లగా మార్చావు
అంతరిక్షంలోంచి కూడా కనబడేటంత
విధ్వంసాన్ని సృష్టి చేశావు!
కూర్చున్న కొమ్మను సాంతం నరికేసావు
ఇక దిగు..
పంచభూతాత్మకమైన ప్రకృతి ముందు
మోకాళ్ళపై కూలబడి నీ తప్పులన్నిటికీ
కన్నీళ్లతో క్షమాభిక్ష వేడుకో
పర్యావరణం చెప్పినట్టు నడు తప్పదు
నీ పిల్లలకు బంగారం కంటే పిడికెడు
మట్టిని మిగిల్చు..
బంగారంలో ఆహారాన్ని పండిరచలేం కదా!

-భీమవరపు పురుషోత్తమ్‌
9949800253

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *