వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర , సెప్టెంబర్ 22: ఓటరు ముసాయిదా జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఎలక్ట్రోల్ రోల్ పరిశీలకులు విజయేంద్ర బోయి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో రాబోయే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పై పోలింగ్ కేంద్రాల, ఓటర్ జాబితాల పరిశీలన తో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ జాబితాలో మార్పులు , చేర్పులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ లతో కలిసి ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వంద శాతం ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు. రాజకీయ పార్టీలు భూతు స్థాయి ఏజెంట్లను నియమించుకొని ఓటరుగా నమోదు చేసుకోని వారిని గుర్తించి నమోదు అయ్యేలా చూడాలని ఆమె తెలిపారు. నియోజకవర్గాల వారిగా ఓటరు జాబితాలు అందించడం జరుగుతుందని వాటిలో మార్పులు చేర్పులు ఉంటే తమ అభిప్రాయాలు, సూచనలను పరిగణంలోకి తీసుకుంటామని తెలిపారు. అత్యధికంగా ఓటర్ నమోదు చేసిన జిల్లాగా ఆదర్శంగా నిలవాలని రాజకీయ ప్రతినిధులకు సూచించారు. ఓటర్ నమోదు ప్రక్రియలో వికారాబాద్ బెష్….జిల్లాలో ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జిల్లా యంత్రాంగం కృషి అభినందనీయమని ఈఆర్వో అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత పెద్ద మొత్తంలో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కృషి చేయాలని ఆమె అన్నారు. మహిళా ఓటర్ల సంఖ్యను కూడా ఇంకా పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల వారిగా 90 సంవత్సరాలు నిండిన ఓటర్లు, ట్రాన్స్ జెండర్ల ఓటర్ల వివరాలపై అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఓటరుగా నమోదు చేసుకున్న, మరణించిన, తొలగించిన , పిడబ్ల్యుడి ఓటర్ల జాబితా లను స్వయంగా పరిశీలించారు. ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రూపొందించిన లఘు చిత్రం, ఓటరు నమోదు ప్రక్రియ పై చేపట్టిన వివిధ కార్యక్రమాల ఫోటోల క్లిప్పింగ్ లను తిలకించి జిల్లా యంత్రాంగం పని తీరుకు ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతకుముందు పరిగి నియోజకవర్గం పూడూరు మండలం మన్నెగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి ఓటర్ జాబితా ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో వికారాబాద్ , తాండూర్ ఆర్డీవోలు విజయ కుమారి , శ్రీనివాసరావు, డిటిడబ్ల్యూఓ కోటాజి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, వికారాబాద్, కొడంగల్ తాసిల్దార్ లు, బిఎల్వో లు పాల్గొన్నారు.




