కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరు
దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది
ఇండియా కూటమి ద్వారానే దేశానికి మంచి రోజులు
తిరగబడదాం… తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదాం
గాంధీ భవన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 15: కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసగించారు. కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడింది, 10వేల ఎకరాలు దోచుకుంది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆరెస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామన్నారు.
దేశానికి స్వాతంత్ర్య ఫలాలు అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆనాడు పోరాటం చేశారన్నారు. “అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశానికి సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ. ఈ ముగ్గురిని మనం ఈ రోజు స్మరించుకుని నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది” అన్నారు రేవంత్ రెడ్డి.
దేశం కోసం వీర వనిత ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పిస్తే ఐటీ రంగం ద్వారా సాంకేతికంగా దేశాన్ని రాజీవ్ గాంధీ మరింత ముందుకు తీసుకెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించారు. కానీ ఈ రోజు దేశంలో విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ జనతా పార్టీ (బీజేపీ) అవలంబిస్తోందని రేవంత్ విమర్శించారు. విద్వేషాన్ని వీడాలని భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు అని ఆయన అన్నారు. మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. కేంద్రం గత ఏళ్లుగా స్లోగన్స్ కు మాత్రమే పరిమితమైందని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఏమైనయ్ అని ప్రశ్నించారు. “దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది..బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు…కానీ పెరిగింది.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ..దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.. మణిపూర్ మండుతుంటే మోదీ, అమిత్ షా కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు. మణిపూర్ లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి… కాంగ్రెస్ ఓడించేందుకు ఈడీ, సీబీఐ ని పంపించారు. నియంతల కంటే నికృష్టాంగ మోదీ వ్యవహరిస్తున్నారు” అని కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయన్నారు.
కాంగ్రెస్ హామీలు ఇస్తుంటే.. సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నాడు. ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నాడు అని రేవంత్ విమర్శించారు. ఆరోగ్యశ్రీని సీఎం నిర్వీర్యం చేశాడన్నారు. రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్లలో నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతున్నదంటే అది కాంగ్రెస్ వల్లే… కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తిరగబడదాం… తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదాం ప్రతీ గడపకు వెళ్లి.. ప్రతీ తలుపు తడదాం..రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.




