ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర వైద్యా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం పటాన్ చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని  కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో మొదటి విడతగా 3500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి  ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు డబ్బులు ఉన్నవారే తెల్లాపూర్, అమీన్ పూర్ ప్రాంతాలలో ఉంటారన్న భావన ఉండేదని,ఇప్పుడు అదే ఏరియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇచ్చారన్నారు. పేదల కలను నిజం చేసిన నిఖార్శైన నాయకుడు కేసీఆర్ అన్నారు. 9 వేల కోట్ల రూపాయల ఖర్చుతో హైదరాబాదులో ఒక లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించామని మంత్రి పేర్కొన్నారు. ఈ ఒక్క రోజు 11,700 ఇండ్లను ఇస్తున్నామన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని ప్రతి నెల ఇండ్లను ఇస్తామని మంత్రి తెలిపారు. కొల్లూరులో సుమారు 60 లక్షల విలువ గల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. ఎలాంటి రెకమండేషన్, ఒక్క పైసా ఖర్చు లేకుండా,అప్పూ, మిత్తీ, లోను కాకుండా ప్రభుత్వమే లక్షల ఖర్చుతో ఉచితంగా పేదలకు అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టి ఇస్తుందన్నారు. హైదరాబాదులో నిర్మించిన టు బిహెచ్ కె ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అని పేర్కొన్నారు. నేడు అద్భుతమైన ఇళ్ళు కట్టామని,అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 2 బిహెచ్ కే కట్టించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అందరికీ గౌరవాన్ని ఇస్తుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం కట్టిన చోట రేషన్ షాప్, ప్రభుత్వాసుపత్రి, అంగన్వాడి కేంద్రాన్ని త్వరలో మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ అధికారులకు ఆదేశాలిచ్చి ఆర్టీసీ బస్సులను వేస్తామన్నారు. అదే విధంగా మసీదు, చర్చి, దేవాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. పేదల కలలను నిజం చేస్తూ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేస్తున్న కేసీఆర్ ను మళ్లీ దీవించాలని మంత్రి కోరారు. అనంతరం ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, గోషామహల్ నియోజకవర్గాల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది  లబ్ధిదారులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ లు, జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *