ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతానికే : ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : ఆమ్ ఆద్మీ పార్టీ తోసహా దేశంలోని 26 లౌకిక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఐ.ఎన్.డి.ఐ.ఏ(ఇండియా) కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతనికే అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. నిరంకుశ అధికార నేషనల్ డెమోక్రాటిక్ ఆల్పైన్స్(ఎన్.డి.ఏ)ను ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికలలో తమ ప్రచారానికి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్(ఇండియా) కూటమిని ఏర్పాటు చేయడం మైలురాయి నిర్ణయం అని తెలిపారు. ఈ మేరకు బుధవారం లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో బీజేపీ దుశ్చర్యలను అరికట్టడానికి, మతతత్వం పేరుతో, దేశభక్తి ముసుగులో దేశాన్ని ముక్కలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ద్వంసం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ఇండియా కూటమి పోరాడుతుందని డాక్టర్ దిడ్డి సుధాకర్ వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ పౌరులు ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అని దేశద్రోహులని ముద్రలు వేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తిప్పికొట్టడానికి 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశమయ్యాయని అయన పేర్కొన్నారు. భూగర్భ ఘనులు, రోడ్లు, ఎయిర్ పోర్ట్లులు, బ్యాంకులు, రైల్వేలు, ఇన్సూరెన్సు, రక్షణ, పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు, బడా కార్పొరేట్ సంస్థలకు హోల్ సేల్ గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్ముకుంటుందని, దేశ సంపదను అమ్ముకోవడం దేశద్రోహం కదా అని అయన ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసి, కనీస మద్దతు ధర కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు ఏడాదికి 2 కోట్ల ఉపాధి కల్పిస్తామని మోడీ సర్కార్ హామీలు ఏమయ్యాయని అయన దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ, మతతత్వ విధానాలతో దేశాన్ని ముక్కలు చేస్తున్న నియంతృత్వ మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్(ఇండియా) కూటమి పటిష్టమైన ప్రణాళిక రూపొందిస్తుందని, వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఖచ్చితంగా విజయం సాధించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించుకుంటామని డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *