కవిత్వమంటే రక్తం చిందే గాయంలోంచో/ చిరునవ్వు చిందే పెదవుల మీద నుంచో వెలువడే పాట అన్నారు ఖలీల్ జిబ్రాన్. హృదయ మధనం నుండి ఉప్పొంగే తండ్లాటే కవిత్వం. కవిలోని ఘర్షణ కవిత్వాన్ని వజ్రంలా మెరిపిస్తుంది. చూపుకు తగిలే ఏ దృశ్యమైనా కవిత్వమై వెలుగుతుంది. తనలోని భావావేశాన్ని, అధ్యయనాన్ని రంగరించి ఏక వాక్య కవితలను వెలువరించారు దేవినేని అరవిందరాయుడు. అజ్ఞాత శక్తి కవిత్వ రూపంగా కనిపించే కవితా వైచిత్రిని ప్రదర్శించారు. ఏకవాక్య కవితాకృతిలో సాహిత్య పరిమళాలను పరివ్యాప్తం చేశారు. మౌనంలోనే జ్ఞాపకాలు పుష్పిస్తాయి… ఊహలు రెక్కలారుస్తాయి అనడంలో అమేయమైన శక్తిని కలిగిన మౌనాన్ని కవితాత్మకంగా శిఖరప్రాయం చేశారు. సూటిదనంతో పాటు ఘాటుగా కనిపించే వాక్యాలు అద్బుతమైన వాక్యశిల్పంతో ఆకట్టుకుంటాయి. రాజీపడని నైజాన్ని ఏకవాక్యాల రూపంలో ప్రతిపాదించారు. బతుకు నాటకానికి… పుట్టుక నాందీవాక్యం…చావు భరత వాక్యం అనడం జీవిత నాటక రంగానికి ఇచ్చిన నిర్వచనంగా భావించాలనిపిస్తుంది. గాలిపటానికి స్వేచ్ఛ ఏదీ… ఎగిరితే దారం తెగితే గాలి… కనురెప్పల తెరలు… మూస్తే కలలే… తీస్తే వాస్తవాలే అనడంలో వాస్తవ దృశ్యీకరణ కన్సిస్తుంది. కొత్తగా తెలిసింది… చక్కెర ఎక్కువైతే… జీవితంలో తీపి తగ్గుతుందని హెచ్చరిస్తారు. పండు వెన్నెల్లో నిండు కోనేట్లో పంచాయతీ… కలువ…తారక… నడుమ చంద్రుడు అని ప్రతీకాత్మకంగా ప్రకృతిని అభివర్ణించారు. వయస్సు… ఆయుస్సూ కదం తొక్కుతున్నాయ్.. పరస్పర విలోమంగా అని జీవిత వాస్తవాన్ని అక్షరీకరించారు.
ఏక వాక్య కవితలు…





