ఎపి రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణం

  • రాజ్‌భవన్‌లో చేయించిన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి
  • హాజరైన సిఎం జగన్‌, ‌చంద్రబాబు, మంత్రులు

అమరావతి, ఫిబ్రవరి 24 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర నూతన గవర్నర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌ప్రశాంత్‌కుమార్‌ ‌మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డితో పాటు ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఏపీకి మూడో గవర్నర్‌గా సయ్యద్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌బాధ్యతలు చేపట్టారు. కర్ణాటకకు చెందిన అబ్ధుల్‌ ‌నజీర్‌.. ‌సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే..

దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్‌ అయిన మూడో న్యాయమూర్తిగా నజీర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జనవరిలో పదవీ విరమణ చేసిన ఆయన ఫిబ్రవరి మాసాంతానికి ఒక రాష్ట్ర గవర్నర్‌ ‌గా ప్రమాణ స్వీకారం చేస్తుండటం విశేషం. బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ ‌స్ధానంలో జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణం స్వీకారం చేశారు. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించిన గవర్నర్‌ ‌నజీర్‌ .. ‌మంగళూరులో న్యాయవిద్యను అభ్యసించారు. 1983లో కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ ‌మొదలు పెట్టారు. 2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అడిషనల్‌ ‌న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే హైకోర్టులో పర్మినెంట్‌ ‌న్యాయమూర్తిగా అవకాశం చేజిక్కించుకున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూనే 2017 ఫిబ్రవరిలో సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌కు పదోన్నతి లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *