న్యూదిల్లీ, జూన్5 : ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన సమావేశానికి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేడీఎస్ నేత కుమారస్వామి, చిరాగ్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. మోదీ సారథ్యంలో పదేళ్లుగా ప్రజాసంక్షేమ విధానాల కారణంగా 140 కోట్ల మంది దేశ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. చాలా సుదీర్ఘ విరామం.. దాదాపు 6 దశాబ్దాల తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో ఐక్యంగా పోరాడి గెలిచినందుకు గర్విస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా.. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తీర్మానంలో నేతలు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది.
ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు జరిగిన ఎన్డీయే కీలక సమావేశంలో ఈ నిర్ణయిం తీసుకున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు లేఖలను కూటమి కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జేడీయూ నేత నితీష్ కుమార్ అందజేశారు. కాగా, ఎన్డీయే కీలక సమావేశం పూర్తికావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకునేందుకు ఎన్డీయే ప్రతినిధి బృందం సిద్ధమవుతోంది. రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతిని కలుసుకోనున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రపతిని ప్రతినిధి బృందం కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందంటూ భాగస్వామ్య పార్టీల మద్దతుతో కూడిన లేఖను అందజేయ నుంది.
మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ఈనెల 8న ప్రమాణస్వీకారం చేసేందుకు నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలుచుకున్నప్పటికీ మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. అయితే, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 292 సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ 272ను అవలీలగా దాటింది. కాగా, 18వ లోక్‌సభ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ, 17వ లోక్‌సభను రద్దు చేయాల్సిందిగా కేంద్ర క్యాబినెట్ బుధవారం ఉదయం నిర్ణయం తీసుకుంది. అనంతరం ప్రభుత్వ రాజీనామాను ప్రధాన మోదీ స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. వెంటనే ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసేంత వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు.




