అధికారంలోకి రాక ముందు ఒక మాట…వొచ్చాక మరోమాట
రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్
మల్కాజ్గిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఊసరవెల్లి కంటే తొందరగా రేవంత్ రెడ్డి రంగులు మారుస్తున్నారని, అధికారంలోకి రాకముందు ఒకమాట వొచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం తాడ్‌బండ్, మల్కాజ్‌గిరిలో విలేఖరుల సమావేశంలో ఈ్నల మాట్లాడు తూ..నేడు ఏ కాలనీకి పోయినా…ఏ వాడకు పోయినా..అందరూ అడిగేది ఒక్కటేనని, తమ కంటోన్మెంట్లో ఏ అభివృద్ధి పనులు జరిగినా కేందప్రభుత్వం చేసిన పనులే కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి పనులూ జరగలేదని, అందుకే లోక్‌సభ ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీనే గెలిపించుకుంటా మంటున్నారని తెలిపారు. ఇక్కడి కాలనీల ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, వారు మోదీతో కలిసి నడుస్తామని చెప్పారని, తనతో కూడా చెప్తున్నారని, నిజమైన పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే అని వారు అంటున్నారని ఈటల పేర్కొన్నారు. కొరోనా సమయంలో తాను చేసిన సేవను నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నామన్నారు. తాను చేసిన సేవలు ప్రజలకు వివరించాల్సిన అవసరం లేదని, తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో స్కూళ్లకు సన్నబియ్యం అన్నం పెట్టించిన సంగతి తాము మరిచిపో లేదని అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి డబ్బు మీదనే కానీ ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ లేదని, ప్రజలు అందుకే బిజెపిని ఆకర్షిస్తున్నారని తెలిపారు. త్రిపుల్ తలాక్ చట్టం తర్వాత ముస్లిమ్‌లు కూడా మోదీకే మద్దతు పలుకుతున్నారని, ముస్ల్లిమ్ మహిళలు కూడా మోదీకే జై కొడుతున్నారని, కేవలం మూడు మాటలతో భార్యాభర్తలు విడిపోకూ డదని కేందప్రభుత్వం ఈ చట్టం చేసిందని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు 500, 1000 రూపాయలకు వోట్లు వేసే పరిస్థితి లేదని వారు చాలా ఆలోచించి వోట్లు వేస్తున్నారని అన్నారు. గురువారం తమ ప్రచారం గౌతమ్ నగర్, మల్కాజ్ గిరిలలో నిర్వహిస్తున్నామని, కంటోన్మెంట్ పరిధిలో తమ కార్యకర్తలందరూ కలిసి మెలసి పనులు చేస్తున్నారని, ఈ విషయంలో తనకు చాలా సంతోషంగా ఉందని, వారు చాలా కమిటెడ్ కార్యకర్తలలని, మొత్తం తెలంగాణలో ఇతర పార్టీలకు లేని కార్యకర్తలు, త్యాగశీలురు బీజేపీలో ఉన్నారని, వారు ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని, తమ జీవిత స్వప్నం బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడమేనని చెప్తున్నారని ఈటల రాజేంద్రర్ ప్రశంసించారు. మల్కాజ్గిరి పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని, కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని, ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలోకి మారిపోవడం, పదవులు పొందడం అనేది నీచమైన పని అని, రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. అలా మారిన వారిని పిచ్చికుక్కలని కొట్టినట్టు కొట్టమన్నారు. కానీ పార్టీ మారిన దానం నాగేందర్‌కు ఎలా టిక్కెట్ ఇచ్చారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఈటల అన్నారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు చచ్చే వయసులో ఇదేం పని అన్నారని, మరి కేకే పట్ల మీరు చేసింది ఏంటని రేవంత్ రెడ్డిని ఈటల ప్రశ్నించారు. 11 శాతం ఉన్న మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాత్ గయా..బాత్ గయా అన్నట్టు మాట్లాడితే ప్రజలు మర్చిపోతారని అనుకోవద్దని, ప్రజల ముందు కుప్పిగంతులు నడవవని వాయన హితవు పలికారు. ఊసరవెల్లి కంటే తొందరగా రంగులు మారుస్తున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒకమాట..వొచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని ఈటల విమర్శించారు.




