హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం పట్ల ఆటో డ్రైవర్లు ఆందోళనలు చెందొద్దన్నారు. అఖిల భారత అసంఘటిత కార్మికులు అండ్ ఉద్యోగుల కాంగ్రెస్(కెకెసి) రాష్ట్ర ఛైర్మన్ కౌషల్ సమీర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం భట్టి విక్రమార్క నివాసంలో మర్యాద పూర్వకరంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు వారు బషీర్ బాగ్ లో విలేకరులకు తెలిపారు. ఈ సందర్బంగా ఆటో విభాగం రాష్ట్ర కార్యదర్శి రుద్రాక్ష మల్లేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోతున్నామని ఆధైర్య పడవద్దని, 15 రోజులు ఓపిక పడితే అన్ని సమన్యలు పరిష్కారం అవుతాయని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి పక్ష పార్టీలకు చెందిన ఆటో సంఘాల నాయకులు చెప్పె మాటలు నమ్మి తొందర పడవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు కూడా కాలేదని అప్పుడే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. మంత్రిని కలిసిన వారిలో కెకెసి నాయకులు పింగళి సంపత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణవేణి, బాల్ రాజ్, ఎర్రవెల్లి రాములు, సుజాత ఉన్నారు.
ఉప ముఖ్యమంత్రి బట్టిని కలిసిన కెకెసి ప్రతినిధి బృందం





