ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, అమర వీరుల కుటుంబాలకు రూ.25 వేల పెన్షన్ ప్రకటించడం హర్షనీయం అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(టీయూఎఫ్) చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్నారు. నూతన రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చీమ శశ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా మారిన సీఎం కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించడం అత్యంత దారుణం న్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి రూ.10 వేల కోట్లతో ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఒక్కనాడు జై తెలంగాణ అనని వాళ్లు నేడు పదవులు, భోగాలు అనుభవిస్తుంటే ఉద్యమకారులు కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లోని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఉద్యమకారుల సంక్షేమం అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు 20 శాతం వాటాను ఉద్యమకారులకు కల్పించాలన్నారు. ఉచిత బస్ సౌకర్యంతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. అసెంబ్లీ స్థానాలు కేటాయించి ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ సమావేశంలో పి.సుదర్శన్ రెడ్డి, గంగా సురేష్, పి.శ్రీనివాస్ గౌడ్, ఐలయ్య యాదవ్, చారీ, నరేందర్ గౌడ్, విష్ణు వర్ధన్, మహేశ్వర్ రెడ్డి, సందీప్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




