ఉగాది సందర్భంగా తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

తిరుమల, మార్చి 11 : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్‌ ‌సేవను టిటిడి రద్దు చేసింది. 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ ‌దర్శనాలను రద్దు చేయడమే కాకుండా.. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించ బోమని స్పష్టం చేసింది. యాత్రికులు ఈ విషయాలను గమనించి సహకరించాల్సిందిగా తితిదే విజ్ఞప్తి చేసింది. తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 22న శ్రీ శోభకృత్‌ ‌నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని శాస్తోక్త్రగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, విశ్వక్సేనులకి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్తోక్త్రగా నిర్వహిస్తారని తితిదే వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *