ఈవీఎంలు లేకుండా పోటీ చేస్తే బిజెపి బండారం బయటపడుతుంది

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ఈవీఎంలే బిజెపి బలమని అవి లేకుండా పోటీ చేస్తే వారి బండారం బయటపడుతుందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసమే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అవతరించిందని 119 స్థానాల్లో బరిలో తమ అభ్యర్థులను నిలుపనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే 70 మందికి బి ఫామ్ లు అందజేశామన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి షేక్ మొహమ్మద్ కరీమ్ ఉద్దీన్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించారు. మల్కాజిగిరి అభ్యర్థిగా రాథోడ్ దిలిప్ కుమార్, ముషీరాబాద్ అభ్యర్థిగా సంతోష్ కుమార్ లకు బి ఫాంలు అందజేశారు. అనంతరం షేక్ జలీల్ మాట్లాడుతూ తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించిన 1,200 కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేయలేదని కనీసం అమరవీరుల కుటుంబాలకు మాత్రం ఎంపి, ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ చేసిన ప్రతి విద్యార్ధి, విద్యార్థినిలకు నెలకు రూ.10 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రూ.100 కోట్లకు ఎమ్మెల్యే టికెట్, రూ.500 కోట్లకు ఎంపీ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే జమీందారు భూ వ్యవస్థను రద్దు చేసి ఉన్న వక్ఫ్ బోర్డు, దేవాలయ భూములను ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలముతో పాటు నిర్మాణము కొరకు రూ.10 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు వారికి ఉచిత కరెంటు అందజేస్తామని అన్నారు. వడ్రంగి, కల్లు గీత, భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదం జరిగితే రూ.10 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని అన్నారు. ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వివాహానికి రూ.5 లక్షలు అందజేస్తామని తెలిపారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం శక్తిగా ఎదుగుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కుల సంఘాలో పని చేసిన వారికీ ఎమ్మెల్యే టికెట్ తో పాటు ఆర్ధిక సహాయం అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఫోన్ : 9063960145 నెం.లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సైదా, రాథోడ్ దిలిప్, సంతోష్ కుమార్, షేక్ బాషా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *