ఇండియా కూటమికి ప్రథమ విజయం

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా ఇటీవల కాలంలో ఏర్పడిన ఇండియా కూటమి మొదటిసారిగా ఘన విజయాన్ని సాధించింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో  ఏడు శాసనసభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి కన్నా ఒక స్థానాన్ని ఎక్కువ సాధించుకోవడం ద్వారా  ఒక విధంగా బిజెపికి సవాల్‌ విసిరినట్లు అయింది. భాజపా సారధ్యంలోని ఎన్డీయే కూటమిని వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ ఓడిరచాలని దేశంలోని వివిధ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. ఆ మేరకు కాంగ్రెస్‌ నేతృత్వంలో సుమారు ఇరవై ఎనిమిది పార్టీలు ఇప్పటికీ  మూడు సార్లు సమావేశమై తమ ఐక్యతా రాగాన్ని చాటుకున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి, బిజెపీపై విజయం సాధించాలని తీర్మానించాయి. ఆ క్రమంలోనే ఈనెల 5న దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.  గురువారం వాటి ఫలితాలు వెల్లడైనాయి. కాగా ఈ ఏడిరటిలో మూడు నియోజకవర్గాలను మాత్రమే బిజెపి గెలుచుకుంది. ఇండియా కూటమి నాలుగు నియోజకవర్గాలను కైవసం చేసుకోవడం ద్వారా తమ ఆధిక్యతను చాటుకున్నాయి.

బిజెపి గెలుచుకున్న మూడు నియోజకవర్గాలు  బిజెపి పాలనలోని రెండు రాష్ట్రాలకు చెందినవే కావడంవల్ల వాటిని ఆ పార్టీయే గెలుచుకోవడంలో పెద్ద విశేషమేమీ లేదన్న వాదన వినవొస్తున్నది.   త్రిపురలోని ధన్‌పూర్‌, బోక్సానగర్‌ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్ధులు గెలుచుకున్నారు. అలాగే ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్‌ అసెంబ్లీ స్థానంలో గెలిచిన బిజెపి అభ్యర్థి కేవలం రెండు వేల 405 వోట్ల  స్వల్ప మెజార్టీతోనే విజయం సాధించాడు. ఇక్కడ విచిత్రకర విషయమేమంటే బిజెపి పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లోని ఘొసీ నియోజకవర్గంలో సమాజ్‌ వాది పార్టీ అభ్యర్థి గెలువటం.  అక్కడ పోటీ చేసిన బిజెపి అభ్యర్థి దారా సింగ్‌ చౌహ్వాన్‌ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుమారు 88 వేలకు పైగా వోట్లు సాధించాడంటే ఉత్తర ప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్‌ పాలనా తీరును చెప్పకనే చెబుతోంది. దీంతో ఇండియా కూటమికి అక్కడి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా  ఉన్నారన్న విషయం అర్థమవుతున్నది. ఓటమి చవిచూసిన దారా సింగ్‌ చౌహాన్‌ 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ నుండి గెలుపొంది, తర్వాత రాజీనామాచేసి బిజెపిలో చేరి, ఆ పార్టీ పక్షాన ఈ ఎన్నికల్లో నిలబడి ఓటమి పాలైనాడు. ఇండియా కూటమిలో చేరిన జార్ఖండ్‌ ముక్తీ మోర్చా అధికారంలో ఉన్న జార్ఖండ్‌ రాష్ట్రంలోని డుమ్రీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలో ఆ స్థానాన్ని అధికార పార్టీయే గెలుచుకుంది.

అలాగే  కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరి  పోరు జరిగినప్పటికీ దివంగత  ముఖ్యమంత్రి ఉమెన్‌ చాంది కుమారుడు చాందీ ఉమెన్‌ సుమారు 36 వేల వోట్ల్ల మెజార్టీతో ఘన విజయం సాధించడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్‌ తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది. దీంతో కాంగ్రెస్‌ వర్గాలు ఎక్కడలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  ఇకపోతే  బిజెపిని మొదటినుండీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న  పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి స్థానాన్ని గెలుచుకునేందుకు అధికార టిఎంసీ, బీజెపీల మధ్య తీవ్ర పోటీ జరిగింది. ఆఖరికి  టీఎంసీ అభ్యర్థి ప్రొఫెసర్‌ నిర్మలా చంద్ర రాయ్‌ విజయం సాధించారు. నిర్మలా చంద్ర రాయ్‌ తన సమీప బిజెపి అభ్యర్థి పైన సుమారు నాలుగు వేల వోట్ల్ల ఆధిక్యతను  సాధించారు. ఇవి ఉప ఎన్నికలే అయినప్పటికీ ప్రస్తుతం దేశంలో మారుతున్న  రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో   జరిగిన ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల ఫలితాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. బిజెపి, ఇండియా వర్గాల మధ్య  జరుగుతున్న సంఘర్షణకు ఇవి తొలి లిట్మస్‌ టెస్ట్‌గా రాజకీయ వర్గాలు అంచానావేస్తున్నాయి.  ఈ ఫలితాలు ఒక విధంగా ఇండియా కూటమికి ఉత్సాహాన్ని కలిగించేవిగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *