ఆర్థిక అసమాలతలతోనే పేదలు విలవిల

దేశ వ్యాప్తంగా ఓ వైపు గత ఏడాదిలో కొరోనా కాటుతో 84 శాతం కుటుంబాల్లో జీవనోపాధి కోల్పోవడమా కాకుండా ప్రాణనష్టం జరగడంతో తమ ఆదాయాలు కుచించుకు పోయాయని, అదే సమయంలో మరో వైపు భారత బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142 వరకు పెరగడం గమనించారు. దేశ జనాభాలో 10 శాతం సంపన్నుల వద్ద 77 శాతం సంపద ఉందని, 2018-22 మధ్య ఏడాదికి 119 మంది బిలియనీర్లు పెరుగుతున్నారని వివరించబడింది. ఇటీవల ‘ఆక్స్‌ఫాం ఇండియా’ విడుదల చేసిన ‘అసమానతలు చంపేస్తున్నాయి (ఇన్‌ఈక్వాలిటీ కిల్స్)-2022’ ‌నివేదిక ప్రకారం భారత్‌లోని తొలి 100 సంపన్నుల ఆస్తులు 57.5 లక్షల కోట్లు(775 బిలియన్‌ ‌డాలర్లు)గా అంచనా వేయబడ్డాయి. కరోనా విపత్తుతో దేశంలో 10 మంది సంపన్నుల ఆదాయం రెట్టింపు కాగా 99 శాతం ప్రజల ఆదాయాలు గణనీయంగా తగ్గాయని తెలుస్తున్నది. ఒక బిలియన్‌ ‌పేదల ఇంధన వినియోగంతో పోల్చితే 20 మంది ధనికులు 8,000 రెట్లు అధికంగా కార్బన్‌ ఉద్గారాలకు కారణం అవుతున్నట్లు తేలింది.
సంపన్నుల ఆదాయం రెట్టింపు – పేదల ఆదాయం తగ్గింపు:
ప్రతి ఏట 63 మిలియన్ల అభాగ్యులు వైద్య ఆరోగ్య ఖర్చులతో కడు పేదరికంలోకి నెట్టబడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో అసమానతలు తొలగడానికి (సమాన వేతనాలు పొందడానికి) 941 ఏండ్ల సమయం తీసుకుంటుందని అంచనా వేశారు. అసమానతలు క్రమంగా, విపరీతంగా పెరగడంతో రోజుకు 21,000 మంది పేదలు అకాల మరణాలకు గురువున్నారని (4 సెకన్లకు ఒక్కరు చొప్పున), కరోనా విపత్తుతో జెండర్‌ ‌పారిటీ 99 ఏండ్ల నుంచి 135 ఏండ్లకు పెరగడం జరిగిందని గమనించారు. 2020లో మహిళాలోకం 59.11 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయారని, 1.3 కోట్ల స్త్రీలు పని దొరక్క అయోమయ పడ్డారని నివేదిక స్పష్టం చేస్తున్నది. అధిక ఆదాయం పొందుతున్న సంపన్నుల నుంచి పన్నులు వసూలు చేసి పేదల హితం కోసమే కాకుండా ప్రాణాలు నిలుపడం కోసం వినియోగించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలుస్తున్నది. అధిక ఆదాయం పొందుతున్న జనాభాలో 10 శాతం బిలియనీర్ల నుంచి 1 శాతం సర్‌చార్జి విధించడం ద్వారా లభించే ప్రభుత్వ పన్నుల ఆదాయాన్ని పాఠశాల విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత లాంటి రంగాల్లో వెచ్చించుట ద్వారా అసమానతలు కొంత తగ్గుతాయని నివేదిక సూచిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో కనీసం ఏడాదికి 67,000 మంది మహిళలు సున్తీ, భర్తల వేధింపులతో మరణిస్తున్నారని, ఆకలితో సాలీనా 2.1 మిలియన్ల పేదలు చనిపోతున్నారని, 5.6 మిలియన్ల పేదలు వైద్య సదుపాయాలు కొరవడి ప్రాణాలు అర్పిస్తున్నారని, 2030 నాటికి వాతావరణ ప్రతికూల మార్పులతో సాలీనా 2.31 లక్షల మంది పేద దేశాల ప్రజలు ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఆర్థిక హింస (ఎకనమిక్‌ ‌వయొలెన్స్):
అసమానతలు పెరగడంతో పేదరికం కూడా అనేక రెట్లు పెరగడం జరుగుతుంది. ప్రజాస్వామ్య దేశంలో కోవిడ్‌-19 ‌విపత్తు సమయంలో అధిక ఆదాయం పొందిన బిలియనీర్ల సంపదలో కొంత ఆదాయాన్ని అట్టడుగు వర్గాలకు పునర్‌ ‌వితరణ చేయడం ద్వారా పేదరికం, అసమానతలు తగ్గుతాయని సూచించింది. అత్యధిక సంపన్నుల సంపద పన్నును తొలగించడంతో పాటు 2016లోనే కార్పొరేట్‌ ‌టాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం అసమంజసంగా ఉంది. కరోనా వైరస్‌ ‌విజృంభన కాలంలో పేదలు, అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు అధిక పన్నులను చెల్లించగా, బిలియనీర్ల నుంచి పన్ను వసూళ్లు అతి తక్కువగా చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. భారత ప్రభుత్వం అతి ప్రధానమైన విద్య, వైద్య రంగాలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం విచారకరంగా తోస్తున్నది. గత ఏడాదితో పోల్చితే 2021-22లో ఆరోగ్యానికి 10 శాతం నిధులు తగ్గించగా, విద్యకు 10 శాతం పెంచడం జరిగింది. మొత్తం ఖర్చులో సామాజిక భద్రతకు 1.5 శాతం నిధులు కత్తిరించడం జరిగింది. దేశ శ్రామిక వర్గాల్లో 93 శాతం అసంఘటిత రంగాల్లో పని చేయడంతో, వేతన/వేజ్‌ల తగ్గింపుతో పేదరికం పెరగడం గమనించారు. విద్య, వైద్యాలను ప్రైవెటీకరణ చేయడంతో మహిళా విద్యకు విఘాతంతో పాటు అసమానతలు మరింతగా పెరగడం గమనించారు. భారత్‌లో వైద్యరంగం ప్రైవెటీకరణతో వ్యక్తి అనుకోని సగటు జేబు ఖర్చులు 62.67 శాతం ఉండగా ప్రపంచ సగటు 18.12 శాతం మాత్రమే ఉన్నది. వైద్య ఆరోగ్య భద్రతలో అసమానతలు, లింగ-ఆధార హింసలు, పేదరికంతో ఆకలి చావులు, వాతావరణ మార్పుల అసమానతలు, టీకా లభ్యతలో అసమానతలతో మానవాళి సతమతమవుతున్నది.
అసమానతల్ని కట్టడి చేసే మార్గాలు:
దేశాల మధ్య అసమానతలు, ఒకే దేశంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య అసమానతలు ప్రపంచ మానవాళి భవితకు ప్రమాదకరంగా మారనున్నాయి. దేశ సమస్యలన్నింటికి ప్రధాన కారణంగా నిలుస్తున్న అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, పౌర సమాజం, విద్యావేత్తలు, ఉన్నతాధికారులు సమన్వయంతో సాగాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కొద్ది మంది వద్ద మాత్రమే సంపద కుప్పలు తెప్పలుగా చేరుతున్నది. ఆర్థిక, సామాజిక, ఆదాయ అసమానతలు తగ్గితేనే పేదరికం రూపుమాపబడుతుంది.
అసమానతలను అర్థం చేసుకుంటూ సంపదను సమానంగా పంచడం, సంపన్నుల నుంచి పన్నును సేకరించి విద్య/వైద్యానికి వినియోగించడం, సామాజిక భద్రతకు నిధులు కేటాయించడం, సమానత్వ సాధనకు చట్టాలకు పదును పెట్టడం లాంటి పలు చర్యలను ప్రభుత్వాలు ప్రాధాన్యతాక్రమంలో తీసుకోవాలి. దేశంలోని 98 బిలియనీర్లకు 4 శాతం పన్ను విధించగా సమకూరే నిధులతో 17 ఏండ్ల వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని లేదా 10 ఏండ్ల పాటు మిషన్‌ ‌పోషన్‌ 2.0 ‌పథకాన్ని కొనసాగించవచ్చని, 1 శాతం పన్నుతో 7 ఏండ్ల పాటు ఆయుశ్మాన్‌ ‌భారత్‌ ‌పథకాన్ని లేదా ఒక ఏడాది పాఠశాల విద్య పథకాన్ని అమలు చేయవచ్చని గమనించాలి. 10 కోట్ల కన్న అధిక ఆదాయం పొందుతున్న దేశ సంపన్నులకు 2 శాతం పన్ను విధిస్తే దేశ బడ్జెట్‌ 121 ‌శాతం పెరుగుతుందని తెలుస్తున్నది. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి, రేపటి భవితను తలచి, అసమానతల్ని నిర్దయగా నరికి, సమానత్వపు మ్నొక్కల్ని నాటి పోషిస్తూ సుందర, సుస్థిర, ప్రశాంత ప్రపంచాన్ని నిర్మించుకుందాం.

image.png

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, కరీంనగరం, 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *