ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, విద్యుత్‌ సబ్సిడీలకు నిధులు విడుదల

తొలి విడుతలోనే విడుదల చేస్తూ ఆర్థిక మంత్రి భట్టి సంతకం
బాధ్యతలు స్వీకరించిన డిప్యూటి సిఎం భట్టి, పొంగులేటి, శ్రీధర్‌ బాబు, సీతక్కలు
సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు,  మీడియాకు లీకులపై అధికారులపై శ్రీధర్‌బాబు ఆగ్రహం
మినీ అంగన్‌వాడీలకు ప్రమోషన్‌…ఆదేశాలు ఇచ్చిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీ 374 కోట్ల రూపాయలను ఆర్టీసీకి విడుదల చేస్తూ ఆర్థిక మంత్రిగా ప్రమాణ బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సిఎం భట్టి తొలి సంతకం చేశారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు. విద్యుత్‌ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలుపై కూడా ఆయన సంతకం చేశారు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు 75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపైనా సంతకం చేశారు. ఇక రాష్ట్ర మంత్రులు పలువురు గురువారం తమ తమ ఛాంబర్‌లలో ప్రవేశించారు. ప్రత్యేక పూజలు చేసి సచివాలయంలో తమకు కేటాయించిన కార్యాలయాల్లో చేరారు. ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్‌ మంత్రిత్వ శాఖల బాధ్యతలను డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, పలువురు నేతలు భట్టికి అభినందనలు తెలిపారు. ఇక డిప్యూటీ సిఎం భట్టి తనకు ప్రభుత్వం కేటాయించిన అధికార నివాసం ప్రజాదర్బార్‌లోకి గృహ ప్రవేశం చేశారు. కుటంబ సభ్యలు తదితరులు వెంట రాగా ఆయన గృహ ప్రవేశం చేశారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్‌ బాబు బాధ్యతలు…
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్‌ బాబు ఉదయం తనకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీధర్‌ బాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్సింగ్‌, గండ్ర సత్యనారాయణ శ్రీధర్‌ బాబును కలిశారు. అలాగే మంథని నియోజకవర్గంతో పాటు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు శ్రీధర్‌బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుంటే సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లపై ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. సోషల్‌ విూడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని, విూడియాకు లీకులు ఇవ్వకూడదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు. ఐటి కంపెనీలు హైదరాబాద్‌ నుండి తరలి వెళ్ళిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేయొద్దన్నారు. సోషల్‌ విూడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టకూడదని ఐటి సెక్రటరీని, అధికారులను శ్రీధర్‌ బాబు హెచ్చరించారు.

సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి బాధ్యతలు…పలువురి శుభాకాంక్షలు
రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్‌, ఆది శ్రీనివాస్‌, యశస్వినీ రెడ్డితో పాటు పలువురు సీనియర్‌ నాయకులు రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్‌ రెడ్డి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ కె. అశోక్‌ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్‌ రాజమౌళి, అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య, జేడీలు జగన్‌, శ్రీనివాస్‌, వెంకట రమణ, డీడీలు మధు సూధన్‌, హాష్మి, రాజా రెడ్డి, సీఐఈ  రాధా కిషన్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.

భువనగిరి స్పోర్ట్‌ కాంప్లెక్స్‌కు 10 ఎకరాల భూమి కేటాయింపు
భువనగిరి జిల్లా రాయగిరిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ తన మొదటి ఫైల్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతకం చేశారు. రూ. 9.50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టి పర్పస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన, క్రీడల శాఖకు కేటాయించారు.
పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీతక్క 


హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : రాష్ట్ర పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా అనసూయ సీతక్క గురువారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్‌ రెడ్డిలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పంచాయితీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హనుమంత రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

మినీ అంగన్‌వాడీలకు ప్రమోషన్‌…ఆదేశాలు ఇచ్చిన మంత్రి సీతక్క
తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఫైల్‌ విూద సంతకం పెట్టారు. ఈ మేరకు ఆమె అంగన్వాడీలకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఇప్పటి వరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై మంత్రి సీతక్క తొలి సంతకం చేశారు. ఆమె నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. మరోవైపు అంగన్వాడీ టీచర్లకు కూడా మంత్రి సీతక్క తీపి కబురు అందించారు. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్‌ విూద కూడా సీతక్క సంతకం పెట్టారు. దీంతో ఇప్పటి వరకు రూ.7,500 జీతం అందుకున్న అంగన్వాడీ టీచర్లు.. ఇప్పుడు రూ.13,500 జీతం అందుకోనున్నారు. మొదటి సంతకంతోనే మంత్రి సీతక్క తమ జీతాలు పెంచడంపై అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *