ఆరు గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వండి

నిధులు ఎలా సమకూరుస్తారో ప్రజలకు చెప్పండి …ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీతో జీవితాలు మారవు
మహాలక్ష్మి కింద 2500 ఎప్పుడు ఇస్తారు… బిఆర్‌ఎస్‌ ఓడినా పెద్దగా నష్టం లేదు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా అమలు చేస్తారో..వాటికి నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్‌ వద్ద ప్రణాళిక లేదన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు రావని చెప్పారు. ఆరు గ్యారెంటీలు ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తారని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారఅని ఆయన ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అయ్యేది కాదు.. పోయేది కాదని ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ ఛార్జిషీట్‌ ప్రకటించింది. ఛార్జిషీట్ల ఆధారంగా కేసులు ఎందుకు నమోదు చేయలేదని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఛార్జిషీట్‌ నిజమైతే బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు ఎందులు లేవని ఆయన ఆడిగారు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ ఒకటే.. రెండు కుటుంబ పార్టీలేనని కిషన్‌ రెడ్డి తెలిపారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో పోటీ పడాల్సిన అవసరం లేదని కిషన్‌ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో పోటీకి ఎలాంటి అజెండా లేదని చెప్పారు. బిఆర్‌ఎస్‌ ఒక్క సీటు రాకున్నా జనానికి వచ్చే నష్టం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌లో అన్ని ఎంపి సీట్లు గెలుస్తున్నామని ఆయన వెల్లడిచారు. కర్నాటకలో 25 సీట్లు బిజెపి గెలవబోతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ 3`4 సీట్లు గెలిచినా రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని చెప్పారు. మోదీని మరోసారి ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని కిషన్‌ రెడ్డి జోస్య చెప్పారు. తెలంగాణలో అత్యధిక సీట్లు బిజెపి గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. అలవికాని హావిూలిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిందని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. సోనియా కుటుంబానికి సేవ తప్ప.. హావిూల అమలుపై కాంగ్రెస్‌కు దృష్టి లేదని చెప్పారు. వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికలు తెలంగాణకు సంబంధించినవి కావు.. దేశానికి సంబంధించిన ఎన్నికలని అన్నారు. ప్రజలంతా నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని కోరారు. మన పిల్లల కోసం, దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం మోదీని ఎన్నుకోవాలని సూచించారు. 2013లో తెలంగాణ సాధన కోసం ఇక్కడ నుంచే ప్రారంభించిన పోరు యాత్ర తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణలో కూడా మార్పు రావడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. తొమ్మిదేళ్లు కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే.. ఇప్పుడు రాహుల్‌ గాంధీ తెలంగాణను దోచుకుని వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు పెట్డడానికి వాడుతున్నారని ఆరోపించారు.

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌ గాంధీకి ట్యాక్స్‌ కడుతుందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు 4 కోట్ల ఇండ్లు కట్టించిందని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కరికి కూడా డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు ఇవ్వలేదని కిషన్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే అవినీతి, కుంభకోణాలే ఉంటాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోదీ దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మోదీ ప్రభుత్వం అణచివేసిందన్నారు. పేద ప్రజల కష్టాల తీర్చడానికి నరేంద్ర మోదీ పని చేస్తున్నారని చెప్పారు. దేశంలో కరెంటు కోతలు, ఎరువుల కోరతలు లేవని కిషన్‌ రెడ్డి వెల్లడిరచారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటి వరకు అతీగతీ లేదని విమర్శించారు. తాను రాగానే రైతులకు రుణమాఫీ, ఎకరానికి రూ.15,000, మహిళలకు రూ.2500 ఇస్తా అని చెప్పారు. మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు.. వాళ్లు మాత్రం కుర్చీలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుటుంబ, అవినీతి, ప్రజలను మోసం చేసే పార్టీలని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *