హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఆన్లైన్ వాల్యుయేషన్‌కి సంబంధించి పిలిచిన టెండర్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ కీలక నిర్ణయం తీసుకుంది. వాల్యుయేషన్ చేసేందుకు ఒక్క కపెనీ మాత్రమే ముందుకొచ్చిందని పేర్కొంది. బిడ్లు రాకపోవడంతోనే పిలిచిన టెండర్‌ను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. త్వరలోనే మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించుకున్నట్లు ఇంటర్‌బోర్డు అధికారులు తెలియజేశారు. గతంలో పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో గ్లోబరేనా సంస్థ అనేక విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే కంపెనీ పేరు మార్చి బిడ్ వేస్తుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే గ్లోబరీనా సంస్థ మాత్రం అలాంటి ప్రయత్నాలు చెయ్యలేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పేపర్ వ్యాల్యూయేషన్లో కీలక పాత్ర పోషించే సంస్థలను టెండర్స్ ద్వారా ఎంపిక చేస్తోన్న సంగతి తెలిసిందే.
గతంలో ఇంటర్ ఎగ్జామ్స్ పేపర్స్ మూల్యాంకనంలో గ్లోబరేనా సంస్థ చేసిన తప్పిదాలు వల్లే ఎంతో మంది విద్యార్థులకు మార్కులు తప్పులతడకగా పడినట్టు భారీ ఎత్తున ఆరోపణలు రావడం తెలిసిందే. ఇంటర్ పరీక్షల్లో తమకు వచ్చిన మార్కులు చూసి ధైర్యం కోల్పోయిన కొంతమంది విద్యార్థిని, విద్యార్థులు అప్పట్లో సూసైడ్స్ చేసుకోవడం వివాదానికి దారితీసింది. ఇంటర్మీడియట్ బోర్డుపై ఎన్నో ఆరోపణలకు దారితీసిన ఆ వివాదం ఇంటర్ బోర్డులో అవినీతి పేరుకుపోయిందనే మాయని మచ్చను వేయడానికి కారణమైంది. అంతేకాకుండా ఈ గ్లోబరేనా సంస్థ మంత్రి బంధువులకు చెందినది.. అందుకనే నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరేనా సాఫ్ట్వేర్ సంస్థను ఎంపిక చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఈ విషయంలో ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ రూ. 6 కోట్ల ముడుపులు తీసుకున్నారని కూడా ఇటీవల ఇంటర్ జేఏసీ చైర్మన్ డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇంటర్ విద్యా మండలి ఆన్లైన్ వాల్యూయేషన్ కోసం జారీ చేసిన టెండర్స్‌ను రద్దు చేయడంపై తాజాగా డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తంచేస్తూ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. మరో సారి ఇంటర్ విద్యా మండలిలోకి అక్రమంగా ప్రవేశించడానికి గ్లోబరేనా సాఫ్ట్వేర్ సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని ఎండ కట్టడంలో ఇంటర్ విద్యా జేఏసీ విజయం సాధించిందని పి మధుసూదన్ రెడ్డి మీడియాకు తెలిపారు. టెండర్ల పక్రియల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను పసిగడుతూ.. ఇంటర్ బోర్డు తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టడంతోనే ఆ కంపెనీలు తగ్గి టెండర్ దాఖలకు ముందుకు రాలేదని.. ఇది ప్రభుత్వం ఇంటర్ విద్యా జేఏసీ విజయంగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం ఈ టెండర్లలో మౌలిక మార్పులు చేసి.. అనుభవం ఉన్న సంస్థలతో ఆన్లైన్ వాల్యుయేషన్‌ని దశలవారీగా అమలు చేయాలని ఇంటర్ విద్య జేఏసి చైర్మన్ ఇంటర్ బోర్డును కోరారు.




