ఆదివాసులకు అడవిచుక్క సీతక్క

ఈ సమాజం సాధారణంగా స్త్రీలను రెండవ శ్రేణి మనుష్యులుగా చూడటం మన కల్పిత కథల్లో నుండిపుట్టిన అసంప్రదాయ దురాచారం ఇప్పటికీ ఆచరణలో ఉందంటే పితృస్వామ్య వ్యవస్థ ను నెత్తిన మోస్తున్న మానవాళిదే పూర్తి బాధ్యత. అడవులలో కొండకొనల ప్రాంతాలలో జన్మించిన వారికి కలిసొచ్చే అంశం శారీరకంగా ధృడంగా ఉండటం,ఎంత కటినమైన సమస్యలనైన అవలీలగా ఛేదించడం గుండె ధైర్యంతో ముందుకు వెళ్లడం అనేవి వీళ్లకు కలిసొచ్చే అంశాలు. ఎన్నో జీవన సంఘర్షణలను ఎదుర్కొని నిలిచి గెలిచిన సీతక్క జీవితం నేటి సమాజానికి ఎంతో ఆదర్శమని చెప్పాలి.సాధారణంగా నక్సలైటు జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడున్న కట్టుబాట్లకు వ్యతిరేకంగా మాట్లాడి ఎవరు కూడా అంతత్వరగా రారానేది ఒక వాస్తవం.కానీ సీతక్క ధిక్కరించి ప్రజల మధ్య నుండే పోరాడాలని జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టింది. కష్టకాలంలో నెత్తిన మూట సంకన సరుకల సంచులను పెట్టుకొని బురదలో కాళ్ళు దిగబడుతాయని చెప్పుల జతను చేతిలోకి తీసుకొని వాగులు వంకలు దాటుకుంటూ అడవిబాట తెలిసిన సీతక్క అడవిబిడ్డల ఆకలిదీర్చిన గుండె తనదని గూడెం ప్రజలు మనసునిండా ప్రేమతో చెప్పుకుంటారు.

సీతక్క ములుగు ప్రాంతంలో జగ్గన్నపేటలో పుట్టింది. పదవ తరగతి అనంతరం జనశక్తి పార్టీ ఉద్యమకారిణిగా సాయుధ దళంలోకి వెళ్లింది.దళ కమాండర్‌ గా ఉన్నప్పుడు తనపేరు రణధీర్‌ అంటే నల్లగా పొడుగ్గా చలాకీగా ఖాకీ యూనిఫారంలో అచ్చం అబ్బాయిలాగే ఉండేది. అడవిబాట పట్టిన సీతక్కకు ఉద్యమ సహాచరిణితో విహహాం అయ్యింది.సీత గర్భవతిగా ఉన్నప్పుడు పోలీసులకు చిక్కి అరెస్ట్‌ ఐతే జైలు జీవితం అనుభవించింది.రెండు నెలల పసికందుని బంధువులకు అప్పగించి అడవుల్లోకి వెళ్లిన ధీర వనిత సీతక్క.
సీతక్క గొంతులో ఏదో జీర వినిపిస్తది బొంగురపోయిన గొంతులవుండి ఆమె మాట్లాడుతుంటే అదొలా వినాలనిపించేటి కమ్మదనం కనిపిస్తది.బహుశ కొండ కొనల అడవుల దారిలో చెట్లకొమ్మలకు కాసిన చిగురు తిని ఆకలికి కొనకొమ్మ పండ్లు రాల్పుకొని కడుపు నింపుకున్నందుకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప బహుమానమైవుంటది. సీతక్కది ఎప్పుడూ పోరాట పంతనే తన జాతికి అన్యాయం జరుగుతున్న అనేక సందర్భాలలో తన గొంతు వినిపించింది.సమ్మక్క సారాలమ్మ దేవతల మేడారం జాతరలో కోయ తెగవారికి భాగస్వామ్యం లేకపోవడంపై ప్రభుత్వ అధికారులతో చర్చించి న్యాయం జరిగేటట్లు చేసింది.

ఆమె పోరాటపంతా ప్రజలందరికి తెలుసు కావున తనకు అండగా నిలబడిన నిలబడకపోయిన జనాల సమస్యలమీద ఎలుగెత్తి కొట్లాడటం తన నైజం అట్లనే 1/70 చట్టంపై అసెంబ్లీలో తరచుగా ఆలోచనాత్మక చర్చ చేస్తూ ఆదివాసీ తెగల ప్రధాన సమస్యలపై నిరంతరం గళమెత్తేది.తన నియోజకవర్గ పరిధిలో ప్రతి పల్లె ప్రతి గూడెం పేరుతో సహా తెలిసి బాటలు అడ్డబాటలు కూడా తెలిసినంత తెలివిరితనం సీతక్కది.
ప్రకృతిలో పరవశించిపోయే ప్రతి మనిషిలో ఏదో కవితాభావం నిండివుంటది అందుకేనేమో వెన్నెల కలం పేరుతో కవిత్వం రాసేది.ఎన్ని అడ్డంకులు ఎదురైన చదువుమీద ధ్యాసను విడువలేదు.రాజకీయ శాస్త్రంలో పి.జి చేసింది.ఆదివాసీల సమస్యలమీద వ్యాసాలు రాయడం గొత్తి కోయల జీవన ప్రమాణాల మీద పరిశోధన చేసి డాక్టరేట్‌ కూడా పొందిన ఘనత తనది. సీతక్కది ఓ వంద సంవత్సరాల కిందట పల్లెజీవన సంప్రదాయంలో ఎటువంటి అరమరికలు లేకుండా ఇరుకు జీవితానికి అలవాటుపడని వ్యక్తిత్వంలా ఉంటుంది.నగరంలో ఉన్నప్పటికీ ఆదివాసీ సంస్కృతికి దూరం కాలేదు.ఎంత పెద్ద హోదాలో ఉన్న తనకు అక్క అనే పదమే నచ్చుతుందని చెప్తుంది.

సీతక్క జీవితం ఒక వ్యాసంలోనే కథలోనో ఇమిడిపోయేటంతటి చిన్నదికాది ఖచ్చితంగా ఒక నవలలో ఇమిడేటంత పెద్ద సంఘర్షణల జీవితం.ఉద్యమాలమీద పొద్దుపొడిసిన జీవనం కొందరిది అర్థాంతరంగా ఆగిపోతుంది పోరాటల సుడిగుండాల తాకిడిని భరించలేక కానీ సీతక్క పోరాటం నేటి స్త్రీ పురుష సమాజామంత చెప్పుకునేటంతటి గొప్ప స్పూర్తిదాయకమైన జీవితం సీతక్కది. పల్లెనిడ్సి బయటికిరాని ఆడబిడ్డల జీవితాల నుండి ఎన్నెన్నో మెట్లను ఎక్కి అసెంబ్లీలో సీతక్క అను నేను క్యాబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఓ మనిషి జీవితంలో మరపురాని గొప్ప పరిణామం.

-అవనిశ్రీ
9985419424

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *