ఆంటీబయాటిక్స్, ఆంటీమైక్రోబియల్ ఔషధాల పట్ల వ్యాధికారక సూక్ష్మజీవులు లేదా పాథోజెన్స్ నిరోదకశక్తిని పొందడంతో వ్యాధి చికిత్స పెద్ద సమస్యగా అవతరిస్తున్నది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి)’ నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం 70 శాతం రోగులకు చికిత్సలో ఆంటీబయాటిక్ ఔషధాలు సూచించబడ్డాయనే ప్రమాదకర విషయం బయట పడిరది. సర్వే చేసిన 20 ఆసుపత్రుల్లోకి 13 ఆసుపత్రుల డాక్టర్లు ఆంటీబయాటిక్ ఔషధాలను రోగులకు సూచించారని తెలుస్తున్నది. ఆసుపత్రుల్లో చేరిన రోగులకు అకారణంగా లేదా విచక్షణారహితంగా దుర్వినియోగం చేయడం లేదా అతి మోతాదులో డోసులను ఆంటీబయాటిక్స్ సూచించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించడం గమనార్హం. రోగులతో పాటు జంతువులు, మొక్కలకు ఆంటీబయాటిక్స్ దుర్వినియోగం ప్రాణాంతకంగా, ప్రమాదకరంగా మారుతున్నది. భారత్ లాంటి అధిక పేద జనాభా కలిగిన దేశాల్లో ఏఎంఆర్ సమస్య అధికంగా ఉండడంతో అంటువ్యాధుల వైద్యం కష్టంగా, అత్యంత ఖరీదుతో కూడినదిగా అవుతున్నది.
ఆంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సంక్షోభంలో భారతం: ఇప్పటికే భారత్ లాంటి పలు దేశాల్లో ‘‘ఆంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్’’ పెరగడంతో వ్యాధి చికిత్స కష్టం కావడంతో పాటు వైద్యం ఖరీదు పెరగడం గమనిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 1.27 మిలియన్ల ప్రత్యక్ష మరణాలు, 4.95 మిలియన్ల పరోక్ష మరణాలు ఆంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల జరిగాయని విశ్లేషించబడిరది. వ్యాధికారకాలు లేదా పాథోజెన్స్ ఔషధాల నిరోధకశక్తి లేదా రెసిస్టెన్స్ను కలిగి ఉండడంతో వ్యాధి చికిత్స చాలా కష్టం అవుతున్నట్లు వివరిస్తున్నారు. ఏఎంఆర్ సంక్షోభ గంభీరతను గుర్తించిన వైద్య సమాజం ప్రతి ఏట నవంబర్ 18 – 24 రోజుల్లో ప్రపంచ ఏఎంఆర్ అవగాహన వారాన్ని కూడా పాటిస్తూ సమస్య పట్ల విస్తృత ప్రచారం చేయడం చూస్తున్నాం.
ఆంటీబయాటిక్స్ దుష్ప్రభావాలు: ఎన్సిడిసి నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం ఒక ఆంటీబయోటిక్ ఔషధాన్ని సూచించబడినన రోగులు 72 శాతం, రెండు ఔషధాలు సూచించబడిన రోగులు 25.3 శాతం, మూడు ఔషధాలను సూచించబడిన రోగులు 13 శాతం ఉన్నట్లు తేలింది. ఒకేసారి రెండు లేదా అంత కన్న ఎక్కువ ఆంటీబయాటిక్స్ వాడిన రోగులపై తీవ్రమైన దుష్ప్రభాలు పడతాయని, ప్రాణాంతకంగా కూడా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన అంటువ్యాధుల చికిత్సలో ‘బ్రాడ్-స్పెక్ట్రమ్ ఆంటీబయాటిక్స్’ సూచించడం, మల్టీడ్రగ్-రెసిస్టెన్స్ అంటువ్యాధుల చికిత్సలో ప్రత్యేక ‘రిజర్వ్ ఆంటీబయాటిక్స్’ను వాడడం జరగాలి.
అతి ఆంటీబయోటిక్స్తోనే వైద్యం: వ్యాధుల చికిత్సలో 33 శాతం మూడవ తరం ఆంటీబయాటిక్స్గా 33 శాతం ‘సిఫాలోస్పోరిన్’ సమూహ ఔషధాలు వాడడంతో పాటు 15 శాతం ఇమిడజోల్స్, 12 శాతం అమైనోగ్లైకోసైడ్స్, 12 శాతం బీటాలాక్టమేజ్ ఇన్హిబిటర్స్, 4 శాతం /కార్బాపినెమ్స్ వర్గపు ఆంటీబయాటిక్ ఔషధాలను 40 శాతానికి పైగా విరివిగా వినియోగించడం గమనించారు. అంటువ్యాధి చికిత్సలో 34 శాతం, అంటువ్యాధులను నిరోధించడానికి (ప్రివెన్ట్వ్) 55 శాతం, ఇతర కారణాలతో 11 శాతం ఆంటీబయాటిక్స్ వాడడం గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం యూపీ ఆసుపత్రుల్లో 93 – 100 శాతం, ఎంపీలో 69 – 99 శాతం, బీహార్లో 96 శాతం, మహారాష్ట్రలో 73 – 96 శాతం, తెలంగాణలో 66 శాతం, ఏపీలో 62 శాతం రోగులు కనీసం ఒక్క ఆంటీబయాటిక్ ఔషధంతో చికిత్స పొందారని తెలుస్తున్నది. ఏఎంఆర్ సమస్య తీవ్రతను గుర్తించి రానున్న రోజుల్లో ఆంటీబయాటిక్స్, ఆంటీమైక్రోబియల్ డ్రగ్స్ను అవసరాన్ని బట్టి పరిమిత డోసుల్లో వాడడానికి వైద్య సమాజం నడుం బిగించారని కోరుకుంటూ ఏఎంఆర్ కారం మరణాలు లేకుండా ప్రపంచాన్ని చూడాలని ఆశిద్దాం. ˜
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





