గువహటి, జూలై 26 : ఒక యువకుడు తన భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన తొమ్మిది నెలల కుమారుడిని వెంట తీసుకుని వెళ్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటన అస్సాంలోని గోలాఘాట్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నజీబుర్ రెహమాన్ బోరా(25) అనే వ్యక్తి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కరోనా లాక్డౌన్ సమయంలో సంఘమిత్ర ఘోష్(24)తో ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది. కొన్ని నెలల్లోనే వారి స్నేహం ప్రేమగా మారింది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కోల్కతాలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆమె గర్భవతి కావడంతో నజీబుర్ ఇంటికి వెళ్లారు. అక్కడే కుమారుడికి జన్మనిచ్చింది.
ఈ క్రమంలో భర్త తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. కుమారిడితో సహా తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న అతడు బెయిల్పై బయటకు వచ్చాడు. తన కుమారుడిని చూసేందుకు భార్య వద్దకు వెళ్లగా.. ఆమె తల్లిదండ్రులు అందుకు అతడిని అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన నజీబుర్ భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన కుమారుడిని తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




