ఇంకెంతని ఏమని భరించగలదు ఈ దేహం
బాల్యం నుండి గాయాలే కదా
గతం నుండి యుద్ధాలే కదా
ఇంకెంత కర్కషత్వం చవిచూసేది
అవమానం అస్తిత్వాన్ని హత్య గావిస్తూ
చిల్లులు పెడుతుంది
ఆత్మాభిమానం ఆద్యంతం వద్దని వారిస్తది
చూసే కళ్ళు కలిపే చేతులు నవ్వే మొహాలు
ఎక్కడో తావు వెతుక్కున్నవే
ఒకరిపై భారం పడొద్దు అనుకుంటూనే
వాళ్ళ మెడకే చుట్టుకుంటాం పోయి
అక్కడితో ఊపిరన్నా పోతుందనుకుంటే
జీవించాలని కసి హెచ్చరిస్తది
బతుకుకు చావుకు చావు బతుకుల కోలాటం
ఎవరో పగ పట్టినట్టు
ఎంతకీ ఎడతెగదు అన్నట్టు
కథ కంచికి చేరేట్టు లేదు
ఎత తీరేట్టు లేదు
కరెంటు తీగకు వేలాడేసినట్టు
అందీ అందినట్టు
నట్టింట్లో ఒంటి కాలుపై
ఎవరని ఎందుకని
అందరికీ ఉన్నాయి స్వగతాలు
కొందరికే ఉన్నాయి సౌఖ్యాలు
హెచ్చుతగ్గుల కోలాహలం
ఎప్పటికీ ఆరని రణరంగ కాష్టం
విస్తుపోయే గద్దలు
పెదవిరిచే రాబందులు
బహు కష్టకాలం సుమీ
ఎటూకాని దారిలో పడితే పాకితే
అశాంతం భయంతో కొయ్యబారుతూ
ఎదురుచూస్తూ వింటూ కాల్చుకుంటూ
ఉండటమే ఒక పనిలా
ఉండేందుకు అస్పృహలా
ఉండరాదు ఇక ఈ జడత్వం మరి ఉండరాదు!!
– వగ్గు రఘువీర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *