అదిగో ఎన్ని ఉదయాలు

తుడుచుకుపోతున్నాయి కదా

అయ్యో ముడుచుకుపోయిన

నీ మెదడు తీరిగ్గా లేదు నిజానికి

జారిపోతున్న నిన్ను

పట్టుకోవడానికి సన్నద్ధంగా లేదు

ఒక ఆలస్యం సొమరితనం అసంతులనం

తికమక అసాహసపు అసహనం

వెరసి ఒక జడత్వం

కదలనివ్వవు కదిలినా సాగనివ్వవు

సాగినా సాఫీగా అవనివ్వవు

ప్రశ్నలకు దాటు సమాధానాలు వెతుక్కునే

సమాధానాలకేమో మెలిక ప్రశ్నలు

కూడగట్టుకునే తత్వం ఒక శైలి అలవడింది

అది ఎప్పటికీ ఢాంబికాలకు పరిమితమై

కర్మను బద్ధకిస్తూ మొద్దుబారుస్తూ

అసమర్థతను పులుముతుంది

మనకు మనం భారంగా

వెగటుగొల్పుతూ వుంటాం అప్పుడప్పుడూ

అద్దం భయపెడుతుంది

మన వ్యవహారం వెక్కిరిస్తుంటుంది

ఒంటరిగా బతకనేర్చాం

బతుకు మరచాం మార్చాం

ఇక మనల్ని మనం మోసం చేసుకోలేక

ఇమడలేక ఉండలేక

సిగ్గుపడుతూ ఎక్కడెక్కడో

కొన్ని చోట్లు దార్లు తిరిగి

ఇక వెతుక్కోలేక నిరీక్షిస్తూ వున్నాం

మనకొచ్చిందేదో మనమేమేమో

మనలో ఏముందో మనమూ వాళ్ళూ

ఆ గీత దాటితే కదా చెరిపితే కదా తెలిసేది

అక్కడంతా సజావుగా జరుగుతున్నట్టు

అనుకుంటావు

అవన్నీ కొన్ని లెక్కలు డొల్ల అనుకుంటావు

అవే నడుపుతున్నాయి చక్రాలను

అవే విజృంభిస్తున్నాయి

ఎన్నో భ్రమలు ఎన్నో గాథలు ఎన్నో మిథ్యలు

ఒక్కొక్కరు ఒక్కో గుంపుకు వేలాడి

ఎంతో శక్తిని ఖర్చుచేసి

సరాఫరాచేసి మార్పిడిచేసి

వదిలి ఒదిలి ఒదిగి ఎదిగి

ఇరిగి ఇగిరి విసిరి కసిరి

చెరిపి నిలిపి ఒలిపి ఒరిగి

మసిలి మరిగి మురిగి కరిగి

ఎగిరి ఎరిగి చెరిగి చిరిగి

చివరికి అసంపూర్ణ శిల్పాలై

బూజుపట్టి ఓ మూలనో ఓ మైదానంలోనో

ఎక్కడో ఓ చోట ముక్కలై

నిశ్శబ్ద వాతావరణంలో

ఎవరో వచ్చి చూస్తున్నప్పుడు

ఎన్ని విధ్వంసకర శబ్దాలనో ధ్వనులనో

అదృశ్యంగా పలుకుతున్నట్టు

పరిపరి విధాల పోతున్నట్టు

చాలా జరిగిపోతుందన్న కాలం ఖడ్గంపై

సాక్షిగా మెడ వుంచిన అపస్మారక దృశ్యం!

 

– రఘు వగ్గు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *