అడ్డ దారిలో డబ్బును సంపాదించడం,బినామీల పేరుతో కోట్ల కొలది సంపదను దాచడం,అందరికీ చెందవలసిన సంపద కేవలం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం వంటి చర్యల ద్వారా పేదలు మరింత పేదలుగా, కుబేరులు సంపదలో మరింత శక్తి వంతులుగా తయారు కావడం ప్రపంచంలో జరుగుతున్న దుర్మార్గమైన అవినీతి తతంగం గా పేర్కొనవచ్చు. తమ తెలివితేటలతో ధనవంతులుగా ఎదగడం ఒక ప్రక్రియ కాగా, అదే తెలివి తేటలతో మోసంతో, సంపదనంతా ఒకే చోట కేంద్రీకృతం చేసుకోవడం అవీనీతికి పరాకాష్ఠ. ఏ రంగంలో పని చేసినా, ఆయా రంగాల్లో తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఆశించడం సహజం. కాని అన్ని రంగాలు సమాన స్థాయిలో ఆర్థిక పరిపుష్ఠితో నిలదొక్కుకోక పోవడం విచారకరం.శారీరక శ్రమతో కొన్ని రంగాలు,మానసిక శ్రమతో మరికొన్ని రంగాలు మనుగడ సాగిస్తున్నాయి. అయితే చాలా చోట్ల శ్రమ దోపిడీ జరుగుతున్నది. పనికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు.సమాజంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఒక విధంగా శ్రమిస్తున్నారు. కొంతమంది పగలు,రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం తమ కుటుంబాల పోషణ కోసం కష్టపడుతున్నారు.అయినా చాలా మందికి పూట గడవడం కష్టంగా మారింది. మరికొంత మంది అడ్డగోలు సంపాదనతో భూమ్యాకాశాలున్నంత కాలం తరగని సంపదతో ఆకాశమే హద్దుగా అపర కుబేరులుగా మారిపోతున్నారు. పెరిగిన సంపదతో సమాజంలో కృత్రిమ మైన గుర్తింపు పొందుతున్నారు. ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బలహీనులను శాసిస్తున్నారు.
దర్పంతో చెలరేగి పోతున్నారు.ఆర్థికంగా ఎదిగిన వారిని చూసి అసూయ పడుతున్నారని కొంతమంది వాదన. ఆర్ధిక ఎదుగుదల అంటే అక్రమ సంపాదన కాదు. ప్రభుత్వ చట్టాలకు లోబడి,పన్నులు ఎగవేయకుండా తమ కష్టార్జితంతో,ప్రతిభతో ఆర్ధికంగా ఎదగడంలో ఎలాంటి తప్పు లేదు. తెలివి తేటలు కూడా ఆర్ధిక ఎదుగుదలకు ఒక ఉన్నత మైన మార్గం. అవినీతిని ప్రతిభ గా వర్ణించడం హాస్యాస్పదం.రాత్రికి రాత్రే కుబేరులుగా మారిపోవడం, వివిధ మార్గాల ద్వారా, పైరవీల ద్వారా ధనవంతులు కావడం ముమ్మాటికీ అవీనీతే.శ్రమకు తగిన ప్రతిఫలం అన్ని వర్గాల ప్రజలకు లభించాలి. అవినీతిని అరికడితే ఆర్ధిక అసమానతలు అంతరిస్తాయి. అన్ని వర్గాల ప్రజలకు అందరితో పాటు సమాన అవకాశాలు లభించాలి. ఇతరుల ప్రతిభను అణచివేయడం, అవినీతి సంపాదనతో కోట్లకు పడగలెత్తడం అందరి కష్టం సంపదగా మారి కొందరి జేబుల్లోకి పోవడం దుర్మార్గం.
ఎక్కడైతే విలువలు నశించి,స్వార్ధం జడలు విప్పి నర్తిస్తుందో,ఎక్కడైతే మానవత్వ ఛాయలు మటుమాయమై,ఆర్ధిక దోపిడీ జరుగుతుందో, ఎక్కడైతే ఆయాచితంగా వచ్చే సంపదకోసం అర్రులు చాస్తారో, ఎక్కడైతే శ్రమకు విలువ నశించి, ఆర్ధికంగా ఎదగడానికి మార్గం సులభతరమౌతుందో,ఎక్కడైతే ఇతరులను దోచుకుని ఎదగాలనే ఆలోచన వికృత రూపం ధరించి వికట్టాటహాసం చేస్తుందో, అక్కడ అవినీతి విశృంఖల విహారం చేస్తుంది. వందమంది సొమ్మును ఒక్కరే గుటకాయ స్వాహా చేసి, ఆకాశహర్మ్యాలనంటే భవంతుల్లో రాజభోగాలను అనుభవించాలనే దురాలోచన వలన పలురకాల అరాచకాలు జరుగుతున్నాయి.అక్రమ ధనార్జనకోసం సాగే అవినీతి క్రీడలో జరిగే మహాపరాధాలకు ఎంతో మంది బ్రతుకు చిత్రాలు తారుమారై పోతున్నాయి.ఎన్నో జీవితాలు ఆర్ధిక లేమితో చితికి పోయి, అల్లాడి పోతున్నాయి.అవినీతి లేని చోటంటూ ఎక్కడా లేదు. నీతికి గుక్కెడు గంజి దొరకదు.గజం జాగా కరువు.అవినీతికి ఆద్యంతాలు కనిపెట్టడం కష్టతరం. పేద,ధనిక, వర్ధమాన దేశాలన్నింటిలో అన్ని రంగాల్లో అవినీతి తాండవిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అవినీతిని నిర్మూలించడానికి, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను వక్రమార్గాలతో కొల్ల గొట్టకుండా పారదర్శకత, జవాబు దారితనంతో పరిరక్షించడానికి అంతర్జాతీయ సహకారం, సాంకేతిక సహాయం కోసం ప్రయత్నించి, అభివృద్ధి దిశగా ప్రపంచాన్ని నడపాలని ఐ రా.స చాలా కాలంగా కృషి చేస్తున్నది.అవినీతి అరికట్టడంలో ప్రభుత్వాల, పౌరసమాజం పాత్ర ఎంతైనా ఉంది.
విద్యావంతులు, న్యాయవాదులు, పాత్రికేయులు సమిష్ఠి బాధ్యత వహించి అవినీతి నిర్మూలనకు పాటు పడాలని అంతర్జాతీయ సమాజం ఆకాంక్షిస్తున్నది. ప్రపంచ సంపద కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం ప్రపంచ ప్రగతికి సూచిక కాదని నిర్ధ్వంద్వంగా చెప్పవచ్చు. ప్రపంచ సంపద పెరుగుతున్నది. పెరిగిన సంపద కొద్దిమంది భోషాణాల్లో మూలుగుతుండడం పెరుగుతున్న ఆర్ధిక అంతరాలకు ప్రత్యక్ష నిదర్శనం. బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్నది.అదే సందర్భంలో జీవించడానికి కనీస మౌలిక సదుపాయాలు లేక కోట్లాది మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గి పోతున్నారు. ఆర్ధిక ఎదుగుదల మంచిదే.కాని అందని ద్రాక్షపండులా, ఎవరికీ ఉపకరించక, విదేశీ బ్యాంకుల్లో మూలిగే ట్రిలియన్ల సంపద వలన ఒరిగే ప్రయోజనం శూన్యం.నిజాయితీ నశించి, న్యాయబద్ధత లోపించి, ఏదో విధంగా లబ్ధి పొందడానికి అనుసరించే అక్రమ మార్గాన్ని స్థూలంగా ‘‘అవినీతి’’ అని నిర్వచించవచ్చు.నీతి లోపించిన ఏచర్యనైనా అవినీతి అని పేర్కొనవచ్చు. అవినీతిలో అనేక రకాలున్నాయి. వాటిని ప్రస్తావించడం అసందర్భం.నీతిగా జీవించే మార్గాలన్నింటినీ మూసేసి, ఆడంబరంగా,అట్టహాసంగా బ్రతకడానికి, ఆకాశహర్మ్యాల్లో సుఖజీవనం సాగించడానికి, అదీ చాలక తమ వారసులకు పదితరాలకు సరిపడా సంపద కూడబెట్టాలనే అత్యాశ విచ్చలవిడి అవినీతికి దారితీస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఈ అవినీతి జాడ్యం ఒక మహమ్మారిలా వ్యాపించింది. దీనికి అడ్డుకట్ట వేయడం ప్రస్తుతానికి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
అవినీతికి,నిష్పాక్షికతకు ప్రతిరూపంగా కఠిన చట్టాలతో అవినీతిని అణచివేసే దేశాలుగా పేరుగాంచిన అమెరికా,చైనాల్లో కూడా అత్యధిక సంపద కేవలం కొద్ది కుటుంబాలకే పరిమితం కావడం ఆయా దేశాల ఆర్ధిక డొల్లతనాన్ని ప్రస్ఫుటం చేస్తున్నది. పైగా ఈ దేశాల ఆదాయం స్థిరాస్తుల పెరుగుదల వలన సాధ్యమయింది. ఆస్తుల విలువ పడిపోతే వీటి అర్ధిక పతనం తథ్యం.ప్రస్తుత ప్రపంచ ఆదాయంలో అధిక శాతం రియల్ ఎస్టేట్, సాప్ట్ వేర్ రంగాల నుంచి లభిస్తున్నది. అమెరికా,చైనా,జపాన్ దేశాలు జి.డి.పి లో ముందంజలో ఉన్నాయి. మరికొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంతో అట్టుడికి పోతున్నాయి. ఎక్కడైతే సంపద సమానంగా పంచబడుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.ప్రపంచ జనాభా పెరుగుతున్నది. పెరుగుతున్న జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. విద్య,వైద్య,ఆరోగ్య రంగాలు అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రజల తలసరి ఆదాయం పెరగాలి.
అప్పుడే ప్రజల జీవన ప్రమాణాల స్థాయి మెరుగుపడుతుంది. ఆర్ధిక అవినీతి వలన పేదలు ఇంకా పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారిపోతున్నారు. ఆర్ధిక అసమానతలు మరింత పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిణామాలకు మూలకారణం అవినీతి, ఆర్ధిక దోపిడీ.ఆర్ధికంగా ఎదగడానికి ఎన్నో అడ్డదారులు ఏర్పడుతున్నాయి. తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేయించడానికి బాలకార్మిక వ్యవస్థ ను ప్రోత్సహించడం,మాదక ద్రవ్యాల అక్రమ తయారీ,రవాణా, మహిళలను అనైతిక కార్యకలాపాలకు ఉపయోగించడం, ఉగ్రవాదులను ప్రోత్సహించడం…ఇలా ఒకటేమిటి ఆర్ధికంగా ఎదగడానికి చేసే అనైతిక చర్యలన్నింటినీ వినియోగించుకునే మార్గాలను సుగమం చేసుకోవడానికి చేసే అరాచకాలకు నడుస్తున్న ప్రపంచ చరిత్ర నిలువుటద్ధం పడుతున్నది. ఆర్ధిక అవినీతి అత్యంత పాపకార్యంగా మారిపోయి, అంతర్జాతీయ సమాజాన్ని శాసిస్తున్నది. ధనార్జన కోసం సాగే వేటలో సామాన్యులు సమిధలుగా మారిపోతున్నారు. అవినీతి విషవృక్షమై,శాఖోపశాఖలుగా విస్తరించి సామాన్యుల బ్రతుకు ముఖచిత్రాలను తలక్రిందులు చేస్తున్నది. ఇకనైనా ప్రపంచ ఆర్ధిక నీతి మారాలి. అభివృద్ధి అంటే అందరికీ కనీస అవసరాలు అందుబాటులోకి రావాలి. అపారమైన సంపద కేవలం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. అవినీతి రహితమైన ధనార్జన,ఆర్ధిక ఎదుగుదల ఆహ్వానించదగ్గ పరిణామమే. అవినీతితో సంపన్నులు కావడం ముమ్మాటికీ అవాంఛనీయం. అవినీతి వరదలా ప్రవహిస్తే ప్రజల బ్రతుకులు చిందరవందర కాక తప్పవు. ఈ విషయాన్ని గ్రహించి అవినీతి పై అంతర్జాతీయ స్థాయిలో పోరాడాలి.అవినీతి భూతాన్ని తరిమికొట్టడం ఇప్పటికిప్పుడే సాధ్యమయ్యే పని కాదు. ఇందుకోసం బాధ్యత,చిత్తశుద్ధితో కూడిన దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం.ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ది. అవీనీతిని అరికట్టడం వలనే ఇది సుసాధ్యం.అవినీతి కోట్లాది మంది జీవితాలకు శాపంగా పరిణమిస్తున్నది.డబ్బు సంపాదన ఒక భయంకరమైన వ్యసనంగా,విలువలను,బంధాలను విధ్వంసం చేసే మానసిక,సామాజిక రుగ్మతగా పరివర్తన చెంది, డబ్బు సంపాదనలో అవినీతిదే సింహభాగం గా మారిన నేపథ్యంలో అవినీతి విషవృక్షాన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించాలి.
సంగాయగూడె, ఏపీ
9704903463.




