అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాల కృషి

డిసెంబర్ 18: మైనారిటీ హక్కుల దినోత్సవం
ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు ఆయా ప్రాంతాల్లోని జాతీయ, సంప్రదాయ, మతాల మరియు భాషాపరమైన మైనారిటీ ప్రజల హక్కులను పరిరక్షించాలని తెలుపుతూ, వారి గుర్తింపునకు అవసరమైన పరిస్థితులను కల్పించి వారిని ప్రోత్సహించ డానికి మైనారిటీ హక్కుల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. మైనారిటీలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి 18 డిసెంబర్ 1992న జాతీయ, సంప్రదాయ, మతాల మరియు భాషాపరమైన మైనారిటీలకు చెందిన ప్రజల హక్కుల పై డిక్లరేషన్ ను ప్రతిపాదించింది. 1993 నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 18వ తేదీని మైనారిటీ హక్కుల దినోత్సవంగా జరుపు కుంటున్నారు.
భారత దేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ (ఎన్.సి.ఎం) ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
భారత ప్రభుత్వం అల్ప సంఖ్యాక వర్గాల కోసం జాతీయ మైనారిటీ కమిషన్‌ చట్టం – 1992 ను రూపొందించింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 2(సి) కింద భారత దేశంలో 6 మతాలను మైనారిటీలుగా గుర్తించారు…. ముస్లింలు,  సిక్కులు,  క్రైస్తవులు, బౌద్ధులు,  జొరాస్ట్రియన్లు (పార్సీలు),  అలాగే  జైనులు  (2014 జనవరి 17న కేంద్ర ప్రభుత్వం జైనులను మైనారిటీలుగా గుర్తించింది).
భారతీయ రాజ్యాంగం మైనారిటీ అనే పదాన్ని నిర్వచించ నప్పటికీ, అది రాజ్యాంగ భద్రతలను మరియు మైనారిటీలకు ప్రాథమిక హక్కులను అందించింది. ఈ హక్కుల ప్రకారం…ఆర్టికల్‌ 29(1): భారత దేశంలో నివసిస్తున్న పౌరుల్లో ఏ వర్గం వారైనా తమ విశిష్ట భాష, సంస్కృతి, లిపిని కాపాడుకునే హక్కు కలిగి ఉంటారు. ఆర్టికల్‌ 29(2): రాజ్యం నిర్వహిస్తున్న లేదా రాజ్య ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో ప్రవేశాలను మత, జాతి, కుల, భాష ప్రాతిపదికన ఏ పౌరుడికి నిరాకరించ కూడదు.
ఆర్టికల్‌ 30(2): అల్ప సంఖ్యాక వర్గాల నిర్వహణలోని విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం మంజూరు చేసే విషయంలో రాజ్యం ఎలాంటి వివక్ష చూపకూడదు.
ఆర్టికల్‌ 347: ఏదైనా ఒక రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న జనాభా తాము మాట్లాడే భాషను ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. రాష్ట్రపతి ఈ సమయంలో తగు చర్యలు తీసుకోవచ్చు. ఆర్టికల్‌ 350: ఏ వ్యక్తి అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏ భాషలోనైనా తన సమస్యను సంబంధిత అధికారికి విన్నవించు కోవచ్చు. ఆర్టికల్‌ 350(ఎ): భాషా పరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాష లోనే విద్యా బోధన చేసేందుకు సదుపాయాలు కల్పించాలి. ఆర్టికల్‌ 350(బి): భాషాపరమైన మైనారిటీల కోసం రాష్ట్రపతి ప్రత్యేకాధికారిని నియమించాలి.
1978లో పార్లమెంట్. ఆమోదం  ద్వారా జాతీయ మైనారిటీల కమిషన్ ను ఏర్పాటు చేసింది.
1985 లో దీనిని హోం మంత్రిత్వ శాఖ నుంచి సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం – 1992 ఆధారంగా 1993లో జాతీయ మైనార్టీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారు. ఇది 1993 మే 17 నుంచి అమల్లోకి వచ్చింది.
2006 జనవరి 29 న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి మైనారిటీలను వేరుచేసి వారికి ప్రభుత్వ విధానాలు మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.
అలాగే వివిధ రాష్ట్రాలు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖల ను ఏర్పాటు చేసుకొని, మైనార్టీల అభివృద్ధికి ఆయా ప్రభుత్వాలు తోడ్పడు తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రజలు అధిక సంఖ్యాకులుగా ఉండడం మన దేశంలో విశేషం.
 రామ కిష్టయ్య సంగన భట్ల…
    9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *