- ప్రభుత్వం వొచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు
- పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భట్టి విక్రమార్క
సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్ 26 : రాష్ట్రంలో అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండాలో సాగింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ నీటి కాలువను విక్రమార్క, దామోదర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అప్పుడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు, వంద రోజులు పనికి వెళ్లే వారికి, నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక ఇంట్లో ఉండే ఇద్దరు ముసలవ్వకు, తాతకు వృద్ధాప్య ఫించన్ ఇస్తామని, ప్రభుత్వం వొచ్చిన తొలి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టంగా తెలిపారు.
నిరుద్యోగులకు నెలకు 4 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన కాకతీయ కాలువ ద్వారా నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఆదివాసీలు, అడవి బిడ్డల కోసం పోడు భూముల చట్టాన్ని తీసుకువచ్చింది యూపిఏ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. అడవి వారిది, అడవి మీద హక్కులు కూడా వారివేనని యూపిఏ ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చిందని, ఈ చట్టాలను అమలు చేయకుండా అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవిలో కలిసిపోయే ఆదివాసీల హక్కులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. మరో నాలుగు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు పెద్ద ఎత్తున ఆదివాసీలకు భూమి పైనా, అడవి పైన హక్కులను వారికే ధారాదత్తం చేసే నిర్ణయాలు తీసుకుంటామని, అంతేగాక అటవీ హక్కుల చట్టాన్ని తూ.చా తప్పకుండా అమలు చేస్తామన్నారు.
ఎవరు ఆపినా, ఎవరు అడ్డుపడినా ఈ పక్రియ మాత్రం ఆగదని, కేసీఆర్ మరోసారి అడవి బిడ్డలను ఆదివాసీలను,గిరిజన కుటుంబాలను మోసం చేసేలా పోడు భూమి పట్టాలిస్తానని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాన్ని కేసీఆర్ గత పదేళ్లుగా చట్ట సభల్లోనూ, బయటా చేస్తూనే ఉన్నాడని, కుర్చీ వేసుకుని అధికార యంత్రాగం మొత్తాన్ని అడవికి తీసుకువచ్చి పోడు భూములు పట్టాలిస్తానని చెప్పిన ప్రగల్బాలను వినివినీ అలసిపోయారని అన్నారు. కాంగ్రెపభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ, చకిలం రాజేశ్వరరావు, వేణారెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్, చింతమల్ల రమేష్, బానోత్ సుజాత, బానోత్ దుర్గాబాయి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




