సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: చిన్న చిన్న గ్రామాలలో ఉన్న పురాతన దేవాలయాలకు కూడా ధూప దీప నైవేద్యాలకు నిధులు కేటాయించి బ్రాహ్మణులకు తోడ్పాటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు కలకుంట్ల వెంకట నరసింహచార్యులు అన్నారు. సమాజ ప్రగతికి, నలుగురికి ఉపయోగపడే పనులు చేయడమే బ్రాహ్మణుల మనస్తత్వం అని… అలాంటి బ్రాహ్మణుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు..వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు.అర్చకులకు దూప దీప నైవేద్యాల కోసం నెలకు పదివేల రూపాయలు అందించేలా తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకొచ్చినందుకు గాను సిద్దిపేటలో దేవాలయాల అర్చకులు సంబరాలు చేసుకున్నారు.సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కులాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుపరుస్తుందన్నారు.గతంలో నెలకు 2500 మాత్రమే ధూప దీవెన నైవేద్యాల కోసం అర్చకులకు చెల్లించే వారని,ఇప్పుడు దానిని పదివేలకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సిద్దిపేట జిల్లాలో 450 ఆలయాలు ధూప దీప నైవేద్య పథకానికి ఎంపిక అయ్యాయని,అన్ని ఆలయాల అర్చకుల తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షులు చిలకమర్రి వెంకట రమణా చార్యులు, కృష్ణ మాచారి, శ్రీనివాస్ రావు, అంజనేయ శర్మ, తదితరులు పాల్గొన్నారు.


