ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 18: గెలిపించిన ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నిస్తుంటే, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాత్రం శిఖండిలా అడ్డుపడుతున్నాడని ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మన్సూరాబాద్ డివిజన్లోని లెక్చరర్స్ కాలనీ, వినాయక నగర్ కాలనీ, బొమ్మలగుడి, ఎల్లారెడ్డి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, టి నగర్ కాలనీ, కేవీయన్ రెడ్డి నగర్ కాలనీ, ఎల్లారెడ్డి కాలనీ, రాజరాజేశ్వరి కాలనీ, పవనగిరి కాలనీలలో కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ తాను అయినా, కార్పొరేటర్లయినా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వారమేనని నీతులు చెప్పే సుధీర్‌రెడ్డి, ప్రజాతీర్పుతో ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లకు అడుగడుగునా ఎందుకు అడ్డు తగులుతున్నాడని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వారయినా ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్లుగా ప్రజల తిరస్కారానికి గురైన వారిని వెంట వేసుకుని తిరుగుతూ అరాచకాలకు ఆజ్యం పోస్తున్నాడన్నారు. గెలిచిన తర్వాత తన స్వార్థం కోసం ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ అధికార పార్టీకి అమ్ముడు పోయిన సుధీర్‌రెడ్డి, ప్రజాతీర్పుకు కట్టుబడి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడుతున్న బీజేపీ కార్పొరేటర్ల కాళ్లకు కట్టె అడ్డం పెట్టిన చందంగా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజేపీ కార్పొరేటర్లకు సముచిత స్థానం ఇవ్వకుండా అవమానపరుస్తున్నాడని అన్నారు. బీజేపీ కార్పొరేటర్లు అభివృద్ధిలో భాగస్వాములైతే వారికి ఎక్కడ మంచి పేరు వస్తుందననే దుర్భుద్ధితో అన్నీ తానే చేయిస్తున్నట్లు పెయిడ్ ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. కార్పొరేటర్లను గెలిపించుకోలేని ఎమ్మెల్యే అని సొంత పార్టీ నాయకులే విమర్శించిన విషయాన్ని సుధీర్‌రెడ్డి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలి తప్ప ఇలా దిగజారుడు రాజకీయాలు చేయవద్దన్నారు. కేవలం తన అనుచరులకే ప్రభుత్వ పథకాలు, తాను సంపాదించిన అక్రమ సొమ్ముతో కొంత మందికి తాయిలాలు అందించి, అలాంటి వారిని ఒక ప్రైవేట్ సైన్యంలా ఏర్పాటు చేసుకుని అరాచకానికి పాల్పడదామనుకుంటే నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రభుత్వ పథకాలు, ఇతర తాయిలాలను కేవలం తన భజనపరులకే తప్ప పార్టీలోని నిజమైన అర్హులకు అందించలేదని సొంత పార్టీ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే సుధీర్‌రెడ్డి పనితీరు ఏ విధంగా ఉందో నియోజకవర్గ ప్రజలు గమనించాలన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్ళెం రవీందర్ రెడ్డి, డివిజన్ బీజేపీ అధ్యక్షులు నాంపల్లి రామేశ్వర్, కొండల్ రెడ్డి, కోటయ్య, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే శిఖండిలా సుధీర్‌రెడ్డి అడ్డుపడుతున్నాడు సామ రంగారెడ్డి




