అఫ్ఘాన్‌లో తాలిబన్ల ఘాతుకం… విద్యార్థినులపై కొరడాతో దాడి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. విద్యార్థినులపై ఓ తాలిబన్‌ అధికారి కొరడాతో విరుచుకుపడ్డారు. ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లో బాదక్షన్‌యూనివర్శిటీ వెలుపల ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తమను యూనివర్శిటీలోకి అనుమతించాలంటూ బురఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు యూనివర్శిటీ గేటు వెలుపల నిరసన చేపడుతున్నారు. ఆగ్రహించిన తాలిబన్‌ ‌మతవ్యవహారాల మంత్రతిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వారిపై కొరడా ఝళిపించారు. విద్యార్థినులను అక్కడి పరుగులు పెట్టించారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా నిఖాబ్‌ (‌తల ముఖాన్ని కప్పి ఉంచే ముసుగు) లేదా బురఖా ధరించాలని తాలిబన్‌ ‌ప్రభుత్వం హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖాన్ని పూర్తిగా కప్పి ఉండేలా బురఖా ధరించాలని, లేకుంటే యూనివర్శిటీలోకి కూడా అనుమతించబోమని అధికారులు కరాఖండిగా చెప్పారు.

దీంతో విద్యార్థినులు తమ విద్య హక్కు కోసం పోరాడుతూ.. నినాదాలు చేశారు. ఈ ఆందోళనలు తాలిబన్‌ ‌ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. ఈ ఘటనను మానవహక్కుల సంఘం సహా పలువురు అధికారులు ఖండించారు. తాలిబన్‌‌ప్రభుత్వం మొదటి నుండి క్రూరంగా ప్రవర్తిస్తోందని మానవహక్కుల సంఘం మండిపడింది. నిరసనకారులను కొట్టడం, ఆందోళనకు అంతరాయం కలిగించడం, ప్రదర్శనను కవర్‌ ‌చేస్తున్న జర్నలిస్టులను నిర్బంధించడం, వేధించడం చేస్తోంది. అనధికార నిరసనలపై కూడా నిషేధం విధించింది. గతేడాది ఆగస్టులో తాలిబన్‌లు ఆఫ్ఘన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుండి మానవ హక్కుల పరిస్థితి దిగజారడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్‌ ‌టాప్‌ ‌లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *