- తెలంగాణ అనుసరిస్తుంది…దేశం అనుసరిస్తుంది
- అదానీ బలోపేతం కావాలంటే మోదీకి వోటేయాలి
- దిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతల వరుస సమావేశాలపై మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28 : ప్రస్తుతం తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నదని, ఏ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చినా మనం అగ్రభాగాన ఉన్నామని, తెలంగాణ ఆచరిస్తుంది..దేశం అనుసరిస్తుందనే స్థాయికి చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ తరహా పథకాలు కావాలని దేశవ్యాప్తంగా కోరుతున్నారని, తాము మహారాష్ట్రకు వెళ్లినప్పుడు తెలంగాణ పోలీసులకు ఇస్తున్న ఇన్సెంటివ్‌ల గురించి అక్కడి పోలీసులు అడిగి తెలుసుకుని, మాకూ ఇలాంటివి కావాలని అన్నారని వివరించారు. తెలంగాణ ప్రజలు తెలివైనవాళ్లని, సీఎం కేసీఆర్ పాలనను కాదనుకోరని, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో రెండో స్థానం కోసమేనన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం ఆయన నాయకత్వానికే ప్రజలు వోటేస్తారని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మధ్య రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి నేతలు వరుసగా తమ పార్టీ సమావేశాలు నిర్వహించడంపై బుధవారం మంత్రి వ్యాఖ్యానిస్తూ…
సీఎం కేసీఆర్‌కు 56 ఇంచుల ఛాతీ లేదేమోగానీ..తెలంగాణలో ప్రతి ఇంచుమీద అవగాహన ఉన్నదని, ప్రతిపక్షాల్లో మంత్రి పదవులు మార్చినా, అధ్యక్షులు మార్చినా, నాయకులను బుజ్జగించినా రాష్ట్ర ప్రజల ఆలోచనల్లో మార్పు రాదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సురక్షితంగా ఉన్నదని, తొమ్మిదేండ్లలో కర్ప్యూలు, అల్లర్లు లేవన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం ఇచ్చారని, ఇలా ఇంకా ఎవరైనా ప్రయత్నం చేశారా? అంటూ మంత్రి ప్రశ్నించారు. తాము ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో అసెంబ్లీ మొదలు కాగానే నీళ్ల కోసం ఖాళీ కుండల ప్రదర్శన, కరెంటు కోసం కందెనల ప్రదర్శన జరిగేదని, ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఇవి నిత్యకృత్యమని, తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో అలాంటివి కనిపించాయా? అంటూ ప్రశ్నించారు హరీష్ రావు.
మధ్యప్రదేశ్‌లో ఎరువులు దొరుకక తొక్కిసలాట జరిగి 8 మంది రైతులు చనిపోయారని, ఇదీ డబుల్ ఇంజిన్ సర్కార్ దుస్థితి అని, తెలంగాణలో ఎరువుల కొరత ఉన్నదా? కరెంటు కొరత ఉన్నదా? అని ప్రశ్నిస్తూ.. పైగా పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటున్నదని తెలిపారు. తమకు బియ్యం కావాలని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తెలంగాణను అడుగుతున్నాయని, మనకంటే భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు బియ్యం అమ్మండి మహాప్రభో అని తెలంగాణను అడిగే స్థితికి తెచ్చింది సీఎం కేసీఆర్ పాలన వల్ల కాదా? అని ప్రశ్నించారు. మనం తినడమే కాదు పొరుగు రాష్ట్రాలకు తిండిపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కాదా? అని,
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా..ఆరోగ్యంగా..సురక్షితం
ఇప్పుడు సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన తర్వాత ఉలిక్కి పడి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ప్రతి ఎకరాకు నీళ్లు, 24 గంటల కరెంటు గురించి మాట్లాడుమంటే మా మీద బురద చల్లుతున్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ తమకు కొత్త కాదని, గతంలో టీఆర్ఎస్ మొదలైనప్పుడు పాలపొంగు అని, నీటి బుడగ అని, తెలుగుదేశం ఏజెంట్ అని, కాంగ్రెస్ ఏజెంట్ అని రకరకాలుగా అన్నారని గుర్తు చేశారు. తాము తెలంగాణ ప్రజలకు మాత్రమే ఏజెంట్లమని అప్పుడు చెప్పినం, కొట్లాడినమని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారని, ఇప్పుడు కూడా తాము ఎవరికీ ఏజెంట్లం కాదని, రైతులకు, బడుగు బలహీన వర్గాలకు, ప్రజలకు ఏజెంట్లమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని తెలిపారు. దేశంలో అదానీ బలోపేతం కావాలంటే మోదీకి వోటేయాలని అన్నారు. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో అదానీ బాగుపడ్డాడు తప్ప..ఏ రంగంలో గుణాత్మక మార్పు వొచ్చిందో చెప్పగలరా అంటూ బిజెపిని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ప్రశ్నించారు.




