అన్ని పాఠశాలల విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ ‌పథకం

అమలుకు విద్యా శాఖ కసరత్తు 
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌సీఎం బ్రేక్‌ఫాస్ట్ ‌పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయకుండా, మాడల్‌ ‌స్కూళ్లు, మదర్సాలు, ఎయిడెడ్‌ ‌పాఠశాల్లోనూ అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ ‌స్కూళ్లు 642, మాడల్‌ ‌స్కూళ్లు 194, మదర్సాలు 100 ఉన్నాయి. వీటిల్లో 1.50 లక్షలకుపైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనున్నది. విద్యార్థులకు ఇప్పటికే నాణ్యమైన విద్యనందిస్తున్న రాష్ట్రప్రభుత్వం.. మానవీయకోణంలో పోషకాహారాన్ని అందించేందుకు ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది.

ఉదయాన్నే విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలన్న సంకల్పంతో అల్పాహార పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పెంచటం, కూలి పనుల చేసుకునే తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదన్న ద్విముఖ వ్యుహాంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నది. సన్నబియ్యం, రాగిజావ, మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు/అరటిపండు.. పదో తరగతి విద్యార్థులకు స్పెషల్‌ ‌క్లాసుల సమయంలో స్నాక్స్‌ను అందజేస్తుండగా, తాజాగా సుపోషణలో భాగంగా బ్రేక్‌ఫాస్ట్ ‌పథకం అమలు చేస్తున్నది.  జీహెచ్‌ఎం‌సీ, సంగారెడ్డి సహా కొన్ని జిల్లాల పరిధిలోని బడుల్లో అక్షయపాత్ర సంస్థ ద్వారా బ్రేక్‌ఫాస్ట్‌ను అందజేస్తారు. మధ్యాహ్న భోజనాన్ని ఈ సంస్థే సమకూరుస్తుండగా, ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ను సమకూర్చే బాధ్యతలను కూడా ఇదే సంస్థకు అప్పగిస్తారు. మిగతా జిల్లాల్లో మధ్యాహ్న భోజనాన్ని వండే కుక్‌ ‌కమ్‌ ‌హెల్పర్లతో తయారు చేయిస్తారు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ‌ద్వారా బ్రేక్‌ఫాస్ట్‌ను పరిశుభ్రంగా వండటంపై శిక్షణనిస్తారు. బడి ప్రారంభానికి ముందే ఉదయం 9: 30 గంటలకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ను వడ్డిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *